BGT 2024: ఇప్పటికి కరుణించారు: ఆస్ట్రేలియా టూర్‌కి దేశవాళీ పరుగుల వీరుడు

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భారత దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న అభిమన్యు ఈశ్వరన్ కు సెలక్టర్లు చోటు కల్పించారు. దీంతో అతని కష్టానికి ప్రతిఫలం దక్కిందని భారత క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.   

దేశవాళీ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాళ్లలో ఉత్తరాఖాండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. లీగ్ ఏదైనా అభిమన్యు తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 2015 నుంచి టెస్ట్ క్రికెట్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అయితే టీమిండియా ఎంట్రీ మాత్రం అతనికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా భారత జట్టు తరపున ఆడలేకపోతున్నాడు.

ఇటీవలే జరిగిన దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలోనూ అభిమన్యు అసాధారణంగా రాణించాడు. ముఖ్యంగా ఇరానీ ట్రోఫీలో 191 పరుగుల భారీ స్కోర్ చేసి అదరగొట్టాడు.ఇప్పటివరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లు ఆడిన  అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్ తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

Also Read : రెప్పపాటులో జడేజా మ్యాజిక్

నవంబర్ 22 నుంచి పెర్త్‌‌‌‌లో జరిగే తొలి టెస్టుతో ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌ మొదలవుతుంది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 6–10 (అడిలైడ్ ఓవల్‌‌‌‌), డిసెంబర్ 14–10 (బ్రిస్టేన్‌‌‌‌), డిసెంబర్ 26–30 (మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌), జనవరి 3–7 (సిడ్నీ) తేదీల్లో చివరి నాలుగు టెస్టులు  జరుగుతాయి. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. 

విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.