Irani Cup: అసాధారణంగా ఆడుతున్నా అవకాశాల్లేవు: అభిమన్యు టీమిండియా ఎంట్రీ ఎప్పుడు..?

దేశవాళీ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాళ్లలో ఉత్తరాఖాండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. లీగ్ ఏదైనా అభిమన్యు తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 2015 నుంచి టెస్ట్ క్రికెట్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అయితే టీమిండియా ఎంట్రీ మాత్రం అతనికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా భారత జట్టు తరపున ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇరానీ ట్రోఫీలోనూ అభిమన్యు 191 పరుగుల భారీ స్కోర్ చేసి తృటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. 

మూడో రోజు సెంచరీతో సత్తా చాటిన ఈ ఉత్తరాఖాండ్ ఓపెనర్ నాలుగో రోజు అదే దూకుడును కొనసాగించాడు. ఒంటరి పోరాటం చేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించాడు.  లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో షామ్స్ ములానీ బౌలింగ్ 191 పరుగుల వద్ద ఈ బెంగాల్ బ్యాటర్‌ను అవుట్ చేశాడు.  అతని ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు.. ఒక సిక్సర్ ఉంది. 

ఇప్పటివరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లు ఆడిన  అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్ తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియాలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో అతని ఎంపిక కష్టంగానే కనిపిస్తుంది. అయితే ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ 29 ఏళ్ళ ఆటగాడికి చోటు దక్కే అవకాశాలున్నాయి. ఇరానీ కప్ విషయానికి వస్తే.. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌటైంది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 537 పరుగులు చేసింది. దీంతో ముంబైకి తొలి ఇన్నింగ్స్ లో 121 పరుగుల ఆధిక్యం లభించింది.