ఆప్ ఎంపీ ప్రమాణానికి అనుమతివ్వని రాజ్యసభ చైర్మన్

ఆప్ ఎంపీ ప్రమాణానికి అనుమతివ్వని రాజ్యసభ చైర్మన్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. జైలులో ఉన్న ఆమ్​ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌‌ఖడ్​ షాక్​ ఇచ్చారు. ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణానికి ధన్​ఖడ్ అనుమతి నిరాకరించారు. సంజయ్ వ్యవహారం రాజ్యసభ ప్రివిలెజెస్ కమిటీ వద్ద ఉందని, ఆయనపై హక్కుల ఉల్లంఘన కేసును కమిటీ విచారిస్తోందని ఆయన తెలిపారు. సంజయ్ సింగ్ ను జనవరిలో ఆప్ రెండోసారి రాజ్యసభకు నామినేట్​చేసిన విషయం తెలిసిందే. సంజయ్​తో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్, చార్టర్డ్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను నామినేట్ చేసింది. ఇందులో సంజయ్ ​మినహా వారిద్దరూ ప్రమాణం చేశారు. 

దీంతో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు, అలాగే, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు 7 రోజుల మధ్యంతర బెయిల్‌‌ ఇవ్వాలని సంజయ్ ఈ నెల 1న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత తన పిటిషన్​ను సవరించి కేవలం ప్రమాణస్వీకారానికి మాత్రమే పర్మిషన్​ ఇవ్వాలని కోరారు. దీంతో ఢిల్లీ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 17 వరకు పొడిగిస్తూ.. పోలీసు కస్టడీలో పార్లమెంటుకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించింది. సంజయ్​ని సోమవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించాలని స్పెషల్​జడ్జి ఎంకే నాగ్‌‌పాల్ జైలు అధికారులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు పార్లమెంట్​కు తీసుకెళ్లినా.. ప్రమాణానికి రాజ్యసభ చైర్మన్​పర్మిషన్​ ఇవ్వలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సంజయ్​ని ఈడీ గత ఏడాది అరెస్ట్ చేసింది.