బుధవారం సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం

బుధవారం సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 16న ప్రమాణ స్వీకారం చేసేందుకు  భగవంత్ మాన్ సిద్ధమవుతున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన ఆహ్వానించారు. ఢిల్లీ సీఎం, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి మార్చి 13న అమృత్‌సర్‌లో భగవంత్ మాన్ రోడ్‌షో నిర్వహించనున్నారు.

అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి భగవంత్ మాన్ ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు. రాజ్‌భవన్‌లో తాను ప్రమాణ స్వీకారం చేయనని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్‌షహర్ జిల్లాలోని ఖట్కర్‌కలన్‌లో తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రకటనపై ఆప్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి 58 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 

మరోవైపు పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి భగవంత్ మాన్ మార్చ్ 12, శనివారం గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలుస్తారు. తాజాగా ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ శుక్రవారం తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. రాజీనామా పత్రాలను గవర్నర్ కు అందజేశారు.

ఇవి కూడా చదవండి

కేజ్రీవాల్కు కమల్ హాసన్ విషెస్

సీఎం రాజీనామా.. ఉత్తరాఖండ్లో ప్రభుత్వం రద్దు