బీజేపీ చేసిన తప్పులకు RSS మద్దతిస్తుందా.?.. మోహన్ భగవత్ కు కేజ్రీవాల్ లేఖ

ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి.   బీజేపీ,ఆప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుగుతుండటంతో  ఓటర్ల జాబితాపై  రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.   ఆపరేషన్ లోటస్ పేరుతో బీజేపీ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 15 రోజుల్లో 5000 ఓట్లను తొలగించి..కొత్త ఓటర్లను చేర్చేందుకు  ప్రయత్నించిందని  కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే . 

 లేటెస్ట్ గా  బీజేపీ తీరుపై  ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మోహన్ భగవత్ కు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ డబ్బులు పంచుతోందని ఆరోపిస్తూ..  మోహన్ భగవత్ కు పలు ప్రశ్నలు వేశారు. 

 బీజేపీ తప్పులకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతిస్తుందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు.  ఓట్లు కొనేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతిస్తుందా? దళిత, పూర్వాంచలి ఓటర్ల పేర్లు పెద్ద ఎత్తున (ఓటరు జాబితాల నుంచి) తొలగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తుందా? బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని మీకు అనిపించట్లేదా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

మరో వైపు కేజ్రీవాల్ కు బీజేపీ కౌంటర్లు వేస్తోంది.   2014లో ఢిల్లీలో ఓటర్ల సంఖ్య  కోటి 19 లక్షలు ఉంటే.. 2015లో కోటి 33 లక్షలకు పెరిగింది.. పెరిగిన ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించింది. కేజ్రీవాల్ హామీలు మోసపూరితంగా ఉన్నాయంటూ విమర్శించారు.

ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోంది. 70 మంది అభ్యర్థుల లిస్ట్ ను రిలీజ్ చేసింది. న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.