ENG vs PAK 1st Test: ఇది ఊహించని ట్విస్ట్: స్పైడర్ మ్యాన్ తరహాలో పాక్ క్రికెటర్ క్యాచ్

అంతర్జాతీయ క్రికెట్ లో ఫీల్డింగ్ ఎంత ముఖ్యం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ లో చక్కగా రాణిస్తే సగం  మ్యాచ్ గెలిచేయొచ్చు. కీలక సమయంలో ఒక్క గ్రేట్ క్యాచ్ అందుకొని మ్యాచ్ ని ప్రత్యర్థి వైపు నుంచి లాగేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ పాకిస్థాన్ ఫీల్డింగ్ మాత్రం అత్యంత చెత్తగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఫీల్డింగ్ లోపాలతో భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ ఫీల్డర్ స్టన్నింగ్ క్యాచ్ తో మెరిశాడు. 

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ మొదటి బంతిని నజీమ్ షా షార్ట్ బాల్ వేశాడు. ఈ బంతిని ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అమీర్ జమాల్ గాల్లో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దూరంగా వెళ్తున్న బంతిని అతను ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. పోప్ షాకవుతూ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరాడు.  

ALSO READ | Women's T20 World Cup 2024: ఫుట్ బాల్ కిక్‌తో రనౌట్..ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ స్కిల్‌కు ఫిదా కావాల్సిందే

సాధారణంగా ఫీల్డింగ్ లోపాలు అనేవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. అయితే పాకిస్థాన్ కి మాత్రం ఈ సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు వీరి ఫీల్డింగ్ గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఉండడం గమనార్హం. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్‌‌ (151), ఓపెనర్‌‌‌‌ అబ్దుల్లా షఫీక్‌‌ (102) అఘా సల్మాన్ (104) సెంచరీలతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.