ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు

భయం.. సైబర్ నేరగాళ్ల ప్రధాన అస్త్రం. మీరు భయపడ్డారంటే అవతలి వారు మరింత రెచ్చిపోతారు. మీ ఖాతాలలో ఉన్న డబ్బులు మొత్తం లాక్కున్నాక వదిలి పెడతారు. ఇది గుర్తుంచుకోండి. మేం పోలీసులం.. మేం కస్టమ్స్ అధికారులం అని అవతలి ఎవరి పేరు చెప్పినా నమ్మకండి.. నమ్మారో లబోదిబోమనాల్సిందే. ఇదిగో అలానే స్కామర్లు TRAI అధికారులుగా నటించి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు. 

 విజయ్ కుమార్‌(39) అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆధార్ కార్డు దుర్వినియోగం చేయబడిందని.. రూ.6 కోట్ల విలువైన మనీలాండరింగ్ కేసులో అతని ఆధార్ ప్రమేయం ఉందని పేర్కొంటూ స్కామర్లు బెదిరించారు.  దీనిపై ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని భయపెట్టారు. అయినప్పటికీ, బాధితుడు పలు ప్రశ్నలు సంధించడంతో.. అతన్ని నమ్మించేందుకు స్కామర్లు ముంబై పోలీసు అధికారులను అనుకరిస్తూ వీడియో కాల్‌ చేశారు. అవతలి వారు వీళ్ల ముఠాకు చెందినవారే కదా.. మరింత బాగా నటించారు. విచారణకు సహకరించకుంటే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.  దాంతో, విజయ్ కుమార్‌ భయపడిపోయాడు.

ALSO READ | ‘రింకు లావణ్య’ పేరుతో చాట్ చేసి రూ. 16 లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్‌లో ఉంటూ ఎంత పనిచేశారు..?

అంతటితో వారి బెదిరింపుల పర్వం ఆగలేదు. కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని భయపెట్టారు. విచారణకు సహకరించకపోతే.. అతని కుటుంబాన్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. చివరకు వరుస లావాదేవీల ద్వారా అతని ఖాతా నుంచి రూ.11.83 కోట్లు స్కామర్లు స్వాహా చేశారు. ఇది జరిగిన రెండ్రోజులకు మోసపోయాయనని గ్రహించిన విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు.