హైదరాబాద్‎లో గ్యాంగ్‎స్టర్ అవ్వాలని యువకుడి భారీ స్కెచ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

రాచకొండ: తుపాకీలు, ఇతర ఆయుధాలు ఉపయోగించి ప్రజలను భయపెట్టి క్రైమ్స్‎కు పాల్పడుతోన్న గ్యాంగ్‎ను మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుండి పోలీసులు 7 లోకల్ మేడ్ వెపన్స్, 11 లైవ్ రౌండ్స్ బులెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఇవాళ (సెప్టెంబర్ 28) మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన  సాయిరాం రెడ్డి బీకాం డిస్ కంటిన్యూ చేసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‎కు వచ్చాడు.

 సూరారంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‎లో ఉంటూ.. నాగోల్ అమెజాన్ బ్రాంచ్‎లో నాలుగు నెలలు పని చేశాడు. ఈ క్రమంలోనే ఈజీ మనీ కోసం అలవాటుపడి దొంగతనాలకు పాల్పడ్డాడు. రెండు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లిన సాయిరాంకు అక్కడ కొందరు నేరస్థులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి సహయంతో గ్యాంగ్ స్టార్ మారి పెద్ద నేరాలకు పాల్పడాలని ప్లాన్ చేశాడు. ముంబై, ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో వెపన్స్‎తో ప్రజలను భయపెట్టి డబ్బు వసూల్ చేయాలని స్కెచ్ వేశాడు.

 జైల్లో నేరస్తుల పరిచయాల ద్వారా తుపాకులు సైతం కొన్నాడు. ఈ ప్రయత్నాల్లో ఉండగానే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఇంకా ఈ గ్యాంగ్‎లో ఎవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు సాగుతోందని.. మిగతవారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. నగరంలో ఇళ్ళు, హాస్టల్స్‎కు వచ్చే వారి పట్ల యజమానులు అప్రమతంగా ఉండాలని ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు విజ్ఞప్తి చేశారు. 

ALSO READ | సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా నగదు పట్టివేత