తనవల్ల చనిపోయిన యువకుడి కోసం రోదిస్తున్న కుక్క

తనవల్ల చనిపోయిన యువకుడి కోసం రోదిస్తున్న కుక్క

 దావణగెరె: తనవల్ల చనిపోయిన యువకుడి కోసం రోదిస్తున్న కుక్క కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేసింది. ఆమె చేతిలో తల పెట్టి మౌనంగా రోదించింది. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

కర్నాటకలోని దావణగెరె జిల్లా క్యాసానకెరెకు చెందిన తిప్పేశ్(21).. నవంబర్ 16న తన సోదరిని బస్‌‌స్టాప్‌‌లో వదిలి పెట్టి బైక్‌‌పై ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలపాలై మరణించాడు. ‘‘తిప్పేశ్ ప్రమాదానికి గురయ్యాక.. అతడిని తీసుకొస్తున్న వెహికల్‌‌ను కుక్క అనుసరించి వచ్చింది. అంత్యక్రియల సమయంలో అక్కడక్కడే తచ్చాడింది.

మూడు రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చింది” అని తిప్పేశ్ బంధువు సందీప్ చెప్పారు. ‘‘అంత్యక్రియల తర్వాత ఇంట్లోకి రావడానికి కుక్క ప్రయత్నించింది. అక్కడున్న వీధి కుక్కలు దాంతో పోట్లాడాయి. కొన్ని రోజులకు ఇంట్లోకి వచ్చి.. నా చేతిలో తల పెట్టింది. తిప్పేశ్ మృతి విషయంలో తన సంతాపాన్ని తెలియజేయడానికి కుక్క ప్రయత్నిస్తున్నదని మేం భావించాం. ఇప్పుడు ఆ డాగ్ మాతోనే ఉంటున్నది” అని తిప్పేశ్ తల్లి యశోదమ్మ చెప్పారు.