తాగొచ్చి వేధిస్తుండని... భర్తను చంపిన భార్య

నాగర్‌‌కర్నూల్‌‌ టౌన్‌‌, వెలుగు: తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ మహిళ భర్తను హత్య చేసింది. ఈ ఘటన నాగర్‌‌కర్నూల్‌‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యాలవాడకు చెందిన కాకునూరి నాగరాజు (35)కు కొన్నేండ్ల కింద సూర్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజు కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారి నిత్యం భార్యను వేధించేవాడు. బుధవారం రాత్రి సైతం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నాగరాజు భార్య సూర్యపై దాడి చేశాడు. తర్వాత అందరూ ఇంట్లో పడుకున్నారు. 

గురువారం ఉదయం పిల్లలు నిద్ర లేచి తండ్రిని లేపేందుకు ప్రయత్నించగా ఎంతకూ లేవలేదు. తల్లిని అడగడంతో తెలియదని సమాధానం ఇచ్చింది. పిల్లలు చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో వారు వచ్చి చూడగా చనిపోయి కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.  నాగరాజు భార్య సూర్యపై అనుమానం కలగడంతో ఆమెను నిలదీశారు. దీంతో తాగొచ్చి వేధిస్తున్నందున అర్ధరాత్రి టైంలో తానే గొంతుకు టవల్‌‌ బిగించి హత్య చేసినట్లు ఒప్పుకుంది. మృతుడి చెల్లెలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, సూర్యను అరెస్ట్‌‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.