అమెరికాలో నల్ల జాతీయుల పట్ల పోలీసుల దుర్మార్గం కొనసాగుతుంది. నల్ల జాతీయుల పట్ల పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తూ వారి మరణానికి కారణమవుతున్నారు. కొద్దిరోజుల క్రితం పోలీసుల చేతిలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన విషయం తెలిసిందే. దొంగ నోట్లు చలామణి చేస్తున్నాడనే అనుమానంతో జార్జిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీస్ ఆఫీసర్ డెరెక్ చౌవిన్ జార్జికి సంకెళ్లు వేసి కిందపడేశాడు. జార్జి మెడపై మోకాలుతో నొక్కిపట్టాడు. ఊపిరి ఆడట్లేదు కాలు తీయాలని జార్జి కోరినా, తోటి ఆఫీసర్ చెప్పినా డెరెక్ వినిపించుకోలేదు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన జార్జి.. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు.
ఘటనపై అమెరికాతో పాటు ఆయా ప్రపంచ దేశాల ప్రజలు నల్ల జాతీయులకు మద్దతిస్తు అండగా నిలుస్తున్నారు. తాజాగా జార్జ్ ఫ్లాయిడ్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. జార్జ్ ప్లాయిడ్ తరహాలో ఓ నల్ల జాతీయుడి మెడపై మొకాలితో నొక్కిపట్టి ఓ పోలీస్ అధికారి విచక్షణారహితంగా వ్యవహరించాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్ కౌంటీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఊపిరి అందకపోవడంతో ఆక్సిజన్ కావాలంటూ రోడ్లపై కేకలు వేశాడు. ఆ కేకలతో స్థానికంగా ఉన్న మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఫైర్ ఫాక్స్ కౌంటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిలో టింబర్లేక్ అనే అధికారి బాధితుణ్ని అదుపులోకి తీసుకొని ప్రయత్నం చేశాడు. ఊపిరి ఆడడం లేదని, ఆస్పత్రికి వెళ్లుతున్నట్లు బాధితుడు చెప్పినా వినకుండా .. టింబర్లేక్ బాధితుణ్ని స్టెన్ గన్‌తో కాల్చాడు. తర్వాత అతణ్ని మోకాళ్లపై కూర్చోబెట్టి వీపుపై కాలితో నొక్కాడు. గొంతు నొక్కేందుకు ప్రయత్నించాడు. ఐ కాన్ట్ బ్రీత్ అని కేకలు వేస్తున్న వినిపించుకోని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితుడి వ్యవహారంపై ఫైర్ ఫాక్స్ కౌంటీ పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు టింబర్లేక్ ను సస్పెండ్ చేశారు. అతనికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.
