తమ్ముడి మోసాన్ని భరించలేక.. ఇద్దరు పిల్లలతో కలిసి అన్న సూసైడ్‌‌‌‌

సిద్దిపేట రూరల్, వెలుగు : డబ్బులు విషయంలో తమ్ముడు మోసం చేయడం, అవమానించడాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణలో ఆదివారం వెలుగుచూసింది. ఏసీపీ మధు, సీఐ ఉపేందర్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట పట్టణంలోని నెహ్రు పార్క్‌‌ వాసవీ కాలనీకి చెందిన తేలు సత్యం (48) ప్రింటింగ్‌‌ ప్రెస్‌‌ నడుపుతూ జీవిస్తున్నాడు. సత్యం, స్వరూప దంపతులకు శరణ్య, కిరణ్‌‌ పిల్లలు ఉన్నారు. స్వరూప కొన్నేండ్ల కింద చనిపోవడంతో సిద్దిపేటకు చెందిన శిరీషను 2016లో రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి అద్వేశ్‌‌ నందా (8), త్రివన్న హాసిని (6) పిల్లలు ఉన్నారు. 

సత్యం ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ట్రీట్‌‌మెంట్‌‌ కోసం సుమారు రూ. 9.50 లక్షలు అప్పు చేశాడు. అయితే గతంలో ఇంటి విషయంలో తన తమ్ముడు శ్రీనివాస్‌‌కు ఇచ్చిన రూ. 5.50 లక్షలను తిరిగి ఇవ్వాలని అడిగేందుకు రెండు రోజుల కింద కొడుకు నందాతో కలిసి శ్రీనివాస్‌‌ ఇంటికి వెళ్లాడు. శ్రీనివాస్‌‌ డబ్బులు ఇవ్వకపోగా సత్యంను అసభ్యకరంగా తిట్టి, చెప్పుతో కొట్టడంతో పాటు ఇంట్లో నుంచి గెంటి వేశాడు. దీంతో మనస్తాపానికి గురైన సత్యం శనివారం రాత్రి పిల్లలను తీసుకొని బైక్‌‌పై బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలైనా ఇంటికి రాకపోవడంతో భార్య శిరీష బంధువులతో కలిసి వెదికారు. ఆదివారం తెల్లవారుజామున సమీపంలోని చింతలచెరువు కట్టపైన సత్యం బైక్‌‌, ఫోన్‌‌ కనిపించడంతో చెరువులో గాలించగా ముగ్గురి డెడ్‌‌బాడీలు దొరికాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా తన భర్త మరణానికి కారణమైన తేలు శ్రీనివాస్‌‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. 

కష్టపడి చదివిస్తే.. నమ్మించి మోసం చేసిండు

ఆత్మహత్యకు ముందు సత్యం సెల్ఫీ వీడియోలో మాట్లాడాడు. ‘మా తండ్రి మరణం తర్వాత అన్నీ నేనే అయి తమ్ముడు శ్రీనివాస్‌‌ను పెద్ద చదువులు చదివించి, పెండ్లి చేశాను. ప్రభుత్వం ఉద్యోగం వచ్చాక నన్ను పట్టించుకోకపోగా, ఇంటి విషయంలో నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు వెళ్లిన నన్ను చెప్పుతో కొట్టాడు. దీని వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను ఒక్కడినే చనిపోతే పిల్లలను ఎవరూ పట్టించుకోరు, అందుకే వాళ్లను కూడా నాతోనే తీసుకుపోతున్న’ అంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.