అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని.. రాయితో కొట్టి.. గొంతు పిసికి చంపిన్రు

నల్గొండ అర్బన్, వెలుగు: అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని భర్తను భార్య.. ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్‎కు చెందిన ఓర్సు వెంకన్న(55), మైసమ్మ దంపతులు కొంతకాలం కింద నల్గొండకు వెళ్లి ముషంపల్లి రోడ్డులో హైటెక్ కాలనీలో గుడిసెలు వేసుకుని ఉంటూ కూలి పనులు చేసి జీవిస్తున్నారు. మైసమ్మకు నల్గొండ మండలం వెలుగుపల్లికి చెందిన కండె భిక్షంకు మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం నడుస్తుంది. 

ఇది వెంకన్నకు తెలియడంతో భార్యతో గొడవలు అవుతుండగా.. బంధువులు మైసమ్మ, భిక్షంను మందలించారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. బుధవారం రాత్రి మద్యం తాగిన వెంకన్నను మైసమ్మ, భిక్షం కలిసి రాయితో కొట్టారు. ఆపై అతనిపై కూర్చుని గొంతు పిసికి హత్య చేశారు. అనంతరం మైసమ్మ తనకేం తెలియనట్టుగా భర్త చనిపోయాడని స్థానికులను నమ్మించింది. మృతుడి సోదరుడి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.