- కంప్యూటర్ ఆపరేటర్ వద్ద రూ.13,590లు స్వాధీనం
బోధన్, వెలుగు: తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దులోని సాలూర రవాణాశాఖ చెక్ పోస్టులో నిజామాబాద్ ఏసీబీ డీఎస్సీ శేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల బృందం సభ్యులు ముందస్తుగా ఆఫీసులోకి వెళ్లకుండా నిఘాపెట్టి రవాణాశాఖ పరిసర ప్రాంతాలను గమనించారు. చెక్‌పోస్టు ముందు నుంచి వాహన డ్రైవర్లు కొంతమంది పర్మిట్లు తీసుకొని వెళుతుండగా, మరి కొంతమంది డ్రైవర్లు ఆఫీసులోని టేబుల్‌పై డబ్బులు పెట్టి వెళ్లిపోవడం గమనించారు.
అనంతరం ఏసీబీ డీఎస్పీతో పాటుగా మరో ముగ్గురు సీఐలు ఆఫీసులోకి ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. ఆఫీసులో హెడ్ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. మంగళవారం డ్యూటీలో ఉండాల్సిన ఎంవీఐ (మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్) శ్రీకాంత్ డ్యూటీలోకి రాకపోవడంతో అతనికి డీఎస్పీ ఫోన్ చేసి రప్పించారు. ఆఫీసులో తనిఖీలు చేపట్టగా కంప్యూటర్ ఆపరేటర్ వద్ద రూ.13,590 పట్టుకున్నారు. ఆఫీసులోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో కొన్ని నెలల నుంచి వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనీఖీలు చేపట్టినట్లు తెలిపారు. పట్టుకున్న డబ్బులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏసీడీ డీఎస్పీ శేఖర్‌తో పాటుగా సీఐలు నగేశ్, శ్రీనివాస్, వేణు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.