ఏలూరు జిల్లాలో వింత... దూడకు ఆరు కాళ్లు.. రెండు తలలు, తోకలు

ప్రపంచంలో వింతలకు కొదవ లేకుండా పోయింది. ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక వింత సంఘటన జరుగుతూనే ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎక్కడ ఏ వింత జరిగిన క్షణాల్లో మన ముందుకు వచ్చేస్తుంది. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు. వీడియోలు క్షణాల్లో వైరల్ గా  మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ప్రత్యక్షంగా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పటికే ఎన్నో వింత ఘటనలు ఇప్పటివరకు మనం చూసాం. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన వింతను ఎందుకు అక్కడ స్థానికులు క్యూలు కడుతున్నారు. ఆ వింతను చూసేందుకే పక్కల ప్రాంతాల నుంచి ఆసక్తిగా అక్కడికి వచ్చామని చెబుతున్నారు.. 

బుట్టాయిగూడెం మండలం కొవ్వాడ గ్రామంలో కుంజా కొవ్వాడయ్య అనే రైతు ఆవులు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన ఉన్న ఆవుల మందులో ఓ ఆవు ఓ దూడకు జన్మనిచ్చింది. ఆ పుట్టిన దూడకు రెండు తలలు, ఆరు కాళ్లతో పాటు రెండు తోకలు ఉండి ఒకే శరీరంతో పుట్టడంతో ఆవు యజమాని కొవ్వాడయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే విషయాన్ని స్థానిక రైతులకు తెలియజేశాడు. రెండు తలలతో జన్మించిన ఆవు దూడను చూడడానికి కొవ్వాడ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలనుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. అయితే పుట్టిన కాసేపటికి ఆ దూడ మృతి చెందింది. మృతి చెందిన వింత దూడను చూడడానికి వచ్చే సందర్శకుల కోసం కొవ్వాడయ్య దాన్ని అక్కడే ఉంచాడు. విషయం తెలుసుకున్న పశు వైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని జన్యు లోపం కారణంగానే దూడ పుట్టి ఉంటుందని, ఆవు గర్భం దాల్చినపుడు రెడు పిండాలు ఆవు గర్భాశయంలో కలిసి అతుక్కుని ఉండడం కారణంగా ఈ విధంగా దూడకు రెండు తలలు ఆరు కాళ్లు రెండు తోకలు వచ్చి ఉంటాయని తెలిపారు.

వేప చెట్టుకు పాలు కారడం, ఆవుకి పంది ఆకారంలో ఉన్న దూడ పుట్టడం, అదేవిధంగా కుక్క పాలు పంది పిల్ల తాగటం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు రాయడానికి పేపర్లే సరిపోనంత పెద్దగా ఉంటుంది. అయితే ఇలాంటి వింత ఘటనలు కొన్ని పరీక్షించిన శాస్త్రవేత్తలు జంతువులు, వృక్షాలలో సంబంధిత మార్పులు జరిగినప్పుడు ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమని చెబుతారు. కొందరైతే ఇలాంటి వింత ఘటనల గురించి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాలు ఏనాడో తెలిపాడని వాదిస్తారు.. ఏది ఏమైనా వింత వింతే.. సాధారణం కంటే భిన్నంగా ఏది జరిగిన అది వింత కిందే పోల్చుతూ ఆశ్చర్యానికి గురవడం సర్వసాధారణమైపోయింది.. ఏది ఎలా ఉన్నా మన పరిసర ప్రాంతాల్లో ఈలాంటి వింత సంఘటన జరిగిందని తెలిసిన ప్రజలు మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మృతి చెందిన వింత దూడను చూసేందుకు పోటీలు పడ్డారు.