అతలాకుతలం.. గాలివాన, పిడుగులతో భారీ నష్టం

  • నాగర్​కర్నూల్​ జిల్లాలో 8 మంది దుర్మరణం

నాగర్​ కర్నూల్​ టౌన్/కందనూలు/కల్వకుర్తి,వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లాలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి దుమారం ధాటికి కల్వకుర్తి, తాడూరు, నాగర్​ కర్నూల్, బిజినేపల్లి మండలాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపోయాయి. తాడూరు మండలం కేంద్రం సమీపంలో కోళ్ళ ఫారం​గోడ కూలి నలుగురు, పిడుగులు పడి బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్​లో ఒకరు, తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో వెంకటయ్య అనే రైతు, తెల్కపల్లి మండల కేంద్రంలో లక్ష్మ ణ్ అనే బాలుడు చనిపోయారు. 

గొర్రెల షెడ్​కు వెళ్లి వస్తుండగా వర్షం రావడంతో చెట్టు కిందికి వెళ్లారు. బాలుడి జేబులో మొబైల్​ ఉండడంతో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే చనిపోగా, మిగిలిన వారు క్షేమంగా ఉన్నారు. మంతటి చౌరస్తాలో కార్​లో కూర్చున్న వ్యక్తిపై పక్కనే ఉన్న రేకుల షెడ్​ గోడ కూలి ఇటుక పెళ్లలు పడడంతో కారు అద్దాలు గుచ్చుకుని ఒకరు చనిపోయారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని ఎండబెట్ల సమీపంలో పిడుగు పడి రాములు అనే రైతుకు చెందిన ఆవు చనిపోయింది. బిజినేపల్లి మండలం కల్వకుంట తండాలో కోళ్ళ ఫారం షెడ్​ రేకులు గాలికి కొట్టుకుపోయాయి. 

ఇండ్లపై రేకులు కొట్టుకుపోవడంతో బట్టలు, ఆహార పదార్థాలు పనికి రాకుండా పోయాయి. కల్వకుర్తి పట్టణంలో గాలిదుమారానికి హోర్డింగులు, ఫ్లెక్సీలు కొట్టుకుపోయి 33/11 కేవీ విద్యుత్​ లైన్లపై పడ్డాయి. చెట్లు కూలి కరెంట్​ స్తంభాల మీద పడి వైర్లు తెగిపడ్డాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడిసిపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. చీకటి పడడంతో విద్యుత్​ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలుగుతోంది. నాగర్​ కర్నూల్  పట్టణంలో రోడ్లపై నీళ్లు పొంగిపొర్లాయి. బస్టాండ్, పాత కలెక్టరేట్, హౌజింగ్​ బోర్డ్​ రోడ్ల మీద వర్షం, మురుగు నీరు చేరి రాకపోకలు ఇబ్బందులు కలిగాయి.

గద్వాల: గద్వాల జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. కేటిదొడ్డి, ధరూర్, గద్వాల మండలాల్లో వర్షం, ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. గద్వాల, అయిజ రోడ్డులో ఈదురుగాలులకు చెట్లు కూలి రోడ్​ మీద పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామ సమీపంలో చెట్టు కూలి రోడ్డుపై పడింది. ధరూర్  మండల కేంద్రంలో 6, పార్సెళ్లలో 5, జాంపల్లిలో 3 కరెంట్ పోల్స్  విరిగిపోయాయి. 

నవాబ్​పేట: మండలంలోని మల్లారెడ్డిపల్లిలో పాలమూరు శేఖర్​ గొర్రెలు చెట్టు కింద ఉండగా, చెట్టు విరిగి   గొర్రెలపై పడడంతో మూడు గొర్రెలు చనిపోయాయి. చౌటపల్లిలో ఆంజనేయులు గౌడ్, యాదయ్యగౌడ్​ ఇంటి రేకులు ఎగిరిపోయి, గోడలు దెబ్బతిన్నాయి. ​యన్మన్​గండ్ల గ్రామంలో చెట్టు కూలి గ్రామ పంచాయతీ భవనంపై పడింది, ఇప్పటూరు గ్రామంలో కరెంట్​ పోల్స్, చెట్లు విరిగి రోడ్లపై పడగా కరెంట్​ సప్లై నిలిచిపోయాయి.

గండీడ్: మండలంలోని సాలార్ నగర్  గ్రామంలో చెట్టు విద్యుత్  వైర్ పై పడడంతో పోల్​ విరిగిపోయింది. డీలర్  గోపాల్  ఇంటిపై చెట్టు విరిగిపడింది. పంచాంగాలతండాలో రేకులు ఎగిరిపోయాయి. 
వనపర్తి: వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో నాలుగు పెద్ద వేపచెట్లు నేలకొరిగాయి. విద్యుత్  పోల్​ నేలకొరగడంతో విద్యుత్  సరఫరా నిలిచిపోయింది. 

కోస్గి: నారాయణపేట వెళ్లే రూట్​లో ఉన్న ధనలక్ష్మి రైస్  మిల్, మహాలక్ష్మి ఆగ్రో  మిల్లుల్లో మెషీన్లు గాలికి ధ్వంసం కావడంతో రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని మిల్లు యజమాని తెలిపాడు. సంతకు వచ్చిన వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముష్రిఫా, భోగారం,  గుండుమాల్  గ్రామాల్లో చెట్టు విరిగి రోడ్డుపై  పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.