విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి అవసరం

సీఎం  రేవంత్ రెడ్డితోపాటు  విద్యా మండలి సభ్యులతో  సహా చాలామంది పూర్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్లే. అరకొర వసతులతో ఆ రోజుల్లో చదువు చెప్పిన ఉపాధ్యాయులంతా  మనసు మీద  ప్రభావితం వేసినవాళ్ళు. చాలామంది ఉపాధ్యాయులే తమ విద్యార్థులను ఆర్ఎస్ఎస్, రాడికల్ సంఘాలలో పనిచేసేటట్టుగా ప్రేరణ ఇ చ్చా  రు. దాంతోపాటు సమాజంలో బాధ్యత ప్రతి గ్రామంలో ఉండేది. ఉపాధ్యాయుల పట్ల  ప్రేమతో కూడిన గౌరవమది.  అతి పెద్ద విద్యార్థి యువజన జనాభా ఉన్న మనదేశంలో నియంత్రణ లేని స్వేచ్ఛ ఎక్కువ అవ్వడం వల్ల విద్యార్థులు చదువుకన్నా ఇతర విషయాలలో  ప్రమాదకర స్థితిలోకి వెళ్తున్నారు. విద్యార్థుల్లో  నైతిక జీవనం నేర్పే వ్యవస్థ లేదు.  చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను  గైడ్ చేసే స్థితిలో లేరు. సామాజిక మాధ్యమాల ప్రభావం మన విద్యార్థులపై అధికంగా ఉంది. అది ఒక వ్యసనంగా మారింది. ఇదంతా మనసుకు, సోషల్ స్ట్రక్చర్​కు సంబంధించిన విషయం. ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? 

మన విద్యా ఆదర్శాలన్నీ పాశ్చాత్య దేశాలకు సంబంధించినవి. ఉపాధ్యాయులకు  బోధించే మనోవిజ్ఞాన శాస్త్రం, మెథడాలజీ, చిల్డ్రన్ సైకాలజీ అంతా విదేశీ మనస్తత్వానికి సంబంధించింది. అది తక్కువమంది చదువుకునే పిల్లలు ఉన్న సమాజానికి సంబంధించిన ఆదర్శం. మేధావుల పేరుతో విద్యావేత్తల పేరుతో చలామణి అయ్యే మన దేశ ఇంటలెక్చువల్స్ మన పిల్లల మెదళ్ళపై రుద్దుతున్న పిచ్చి సూత్రాలు. విద్యార్థుల చదువులో సమాజానికి ప్రభుత్వానికి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలి. కేవలం ఉపాధ్యాయులను టార్గెట్ చేయడం విద్య యొక్క లక్ష్యాన్ని నెరవేర్చదు. 

పాఠశాలలు, గురుకులాల్లో ఎందుకు తేడా?

గురుకులం లాంటివి ఎందుకు సక్సెస్ అవుతున్నాయి అంటే అక్కడ నిర్బంధ విద్యతోపాటు మెరికెల్లాంటి పిల్లల్ని టెస్ట్ ద్వారా తీసుకుంటున్నారు. అదే బయట ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో  సాధారణ విద్యార్థులు చేరుతున్నారు. వీళ్ళ పట్ల సమాజానికి ప్రభుత్వానికి తల్లిదండ్రులకు ఏ బాధ్యత ఉండట్లేదు. బాగా చదువుకున్న విద్యార్థులంతా ఉన్నత చదువులు ఉద్యోగాల వైపు వెళ్తుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు రాజకీయ, వ్యాపార వ్యవస్థలోకి చొరబడుతున్నారు. అందుకే ఆ రాజకీయాలు కూడా అపరి పక్వంగా, అవినీతితో బలప్రయోగంతో ఉంటున్నాయి. దీనికి విద్యాసంస్కారం లేకపోవడమే కారణం. 

శాశ్వత విద్యావిధానం అవసరం

నిర్బంధ విద్యలో ప్రభుత్వం వాళ్లకు కావాల్సిన వస్తువులను అందిస్తూ బాధ్యత వహిస్తున్నది. మిగతా పాఠశాలల్లో అలాంటి పరిస్థితి లేదు. ఉపాధ్యాయుల గ్రేడింగ్ పక్కనబెట్టి మొదట విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే పని ప్రభుత్వం, విద్యా మిషన్ చేయాలి. విద్యార్థులకు చెప్పే చదువుకున్న ఉపాధ్యాయులకు చెప్పే శిక్షణలే ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త కొత్త విధానాలను రూపొందిస్తూ ఉపాధ్యాయులకు స్థిరమైన బోధన చేసే అవకాశాన్ని విధ్వంసం చేస్తున్నారు. అకడమిక్ అప్డేషన్ అనేది సాధారణంగా ఉండాలి. అది వ్యవస్థను మొత్తం తలకిందులు చేసేటట్టుగా ఉండకూడదు. ఉపాధ్యాయుడినీ కాస్ట్ లీ  క్లర్క్​గా మార్చేశారు. కేవలం ఇది పాఠశాలల్లో మాత్రమే లేదు. డిగ్రీ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు కూడా ఇలాంటి క్లర్కులుగానే మారిపోయారు. కేవలం న్యాక్  అక్రిడేషన్ కోసం ఫొటోలు దిగే వ్యవస్థగా ఆచార్యుడిని దిగజార్చారు.

కార్పొరేట్ వ్యవస్థను ఏ దృష్టితో చూస్తారు?

ప్రభుత్వమే మేము కార్పొరేట్ విద్యను అందిస్తాము అంటున్నది. అంటే వసతుల్లోనా! విద్యలో నా? అన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మహిళా కమిషన్​కు సంబంధించిన నేరెళ్ల శారద ఇటీవల కార్పొరేట్ కళాశాల తనిఖీ చేస్తే చూసిన వింతలు సమాజం ముందున్నాయి. ఎవరైనా పరిశీలిస్తే తెలుస్తుంది. లక్షల రూపాయల ఫీజుల దోపిడీతో అతి కొద్ది మందికి మాత్రమే అందుతున్న ర్యాంకుల పంటది. కానీ వాళ్ల కార్పొరేట్ మైండ్​తో ప్రసార మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం ఊదరగొడుతున్న ర్యాంకులు సమాజంలోని ఎగువ మధ్యతరగతి వర్గాలను ప్రభావితం చేస్తున్నాయి. నిజానికి అక్కడ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల కేస్ స్టడీ మనం చూస్తే చాలామంది తల్లిదండ్రుల బాధ్యత దాని వెనుక ఉంది. కొందరు తల్లిదండ్రులు ఇళ్లల్లో విద్యార్థులను భరించలేక ఎక్కడ నష్టం అయిపోతారో అన్న ఉద్దేశంతో అందులో చేర్చుతున్నారు. అందులో చేరిన ప్రతి విద్యార్థికి ఏమీ ర్యాంకులు రావట్లేదు.

ఎన్నో ఆదర్శాలు మన ముందున్నాయి..

 ఇవాళ వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగినా విద్యారంగంలో నాణ్యమైన మార్పులు రావడం లేదు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం హైదరాబాదు నల్లకుంట ప్రాంతంలో ఉదయం పని చేసుకుని బతికే విద్యార్థుల కొరకు సాయం కళాశాల స్థాపించాడు.  గత ప్రభుత్వం అలాంటి ఓరియంటల్ కళాశాలలను మూసివేసి పక్కన ఉన్న డిగ్రీ కాలేజీలో కలిపేసింది. ఇప్పుడు అక్కడున్న లైబ్రరీ భవనంతో సహా నిరుపయోగంగా ఉన్నాయి. ఎన్నో చోట్ల ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలు పూర్వం ఎందరో ప్రముఖులు తమ సొంత ఆస్తులు అమ్మి నడిపించారు.  బాగ్ లింగంపల్లిలో అంబేద్కర్ కళాశాల అలాంటి దృక్పథంతో ప్రారంభించిందే. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్న ఏవీ కళాశాల కూడా ఆ సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిందే. ఆంధ్ర సారస్వత పరిషత్తు కూడా అలాంటి భావాలతో ప్రారంభమైందే. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  నడిపే శిశుమందిరాలు విద్యతోపాటు సంస్కారాలను అందిస్తున్నాయి. సామాన్యమైన వ్యక్తులు వాటిని అద్భుతంగా నడుపుతున్నారు. 

ఉపాధ్యాయ నేతల పాత్ర ఎంత?

ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎమ్మెల్సీలు అయినప్పటి నుండి మరింత దరిద్రం విద్యా వ్యవస్థకు చుట్టుకున్నది. మంత్రులను ముఖ్యమంత్రు లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా ఒక ఎమ్మెల్సీ ఒకప్పుడు ముఖ్యమంత్రి కాళ్ల మీద పడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కార్పొరేట్ వ్యవస్థను నడిపిస్తున్న పార్టీల నాయకులు.. ప్రభుత్వ ఉన్నతాధికారులు వీటిని నడిచే శవాలుగా మార్చేస్తున్నారు. అలవి కాని అమలు చేయలేని పాలసీలను రూపొందిస్తున్న విద్యా శిక్షణ మండలి కూడా ఇందులో ప్రధాన దోషి.  అలాగే గ్రామంలోని సర్పంచులు వార్డు సభ్యులు ప్రాదేశిక సభ్యులు పదవులు వెలగబెట్టడానికి మాకు గొప్ప అవకాశం అని అనుకుంటున్నారు గాని మా గ్రామంలో విద్యార్థులను చదివించాలన్న తపన వాళ్ళ మనసులో ఎక్కడా లేదు. ఎంతసేపూ ఈ పథకాలను పంపిణీ తమకు క్షణంలో ఖర్చుపెట్టిన  డబ్బు ఎలా వస్తుందని ఆలోచించే స్థితికి మన రాజకీయ వ్యవస్థ వాళ్లను దిగజార్చింది. 

విలువలపై విద్యా కమిషన్ ​ఆలోచించాలి

ప్రతిరోజు మనం పేపర్లు చూస్తే ఎంతోమంది ఉన్నతాధికారులు లంచాలతో పట్టుబడుతున్నారు.  వీళ్ళ మీద రాజకీయ ప్రభావం తగ్గాల్సిన అవసరం లేదా.! తనపై అత్యాచారం జరిగిందని ఒక స్త్రీ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆమెపై అత్యాచారం చేసే అన్యాయం ఎవరు సరి చేస్తారు.? వీళ్ళందరికీ చదువు లేక ఈ పొరపాటు చేస్తున్నారా లేక సంస్కారం లేక చేస్తున్నారా? కాబట్టి చట్టానికి కేవలం సాక్ష్యాలు మాత్రమే అవసరం అవుతాయి. మరి న్యాయం, ధర్మం ఎలా  మనగలుగుతుంది. అది విద్య ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఆ విద్యకు సంస్కారం కావాలి. యాంత్రికమైన విద్య కది సాధ్యపడదు. సుపరిపాలన  ప్రజా పాలన అంటే కేవలం వసతులు కల్పించడం కాదు. దానితోపాటు జీవనం మూల్యాలు తెలియజేయాలి.  ఇదంతా విద్యా కమిషన్ ఒక రిపోర్టుగా ఆలోచించి ఆచరణాత్మకంగా    చేసినప్పుడు     మాత్రమే వాళ్లు  పొందిన పదవులకు సార్థకత ఏర్పడుతుంది.

హృదయాన్ని కలచివేస్తున్న ఘటనలు

ఇటీవల వికారాబాద్ జిల్లాలో ముగ్గురు మైనర్లు ఎనిమిదవ  తరగతి విద్యార్థిని అత్యాచారం చేయడం సమాజం నైతికంగా ఎంత పతనం చెందిందో తెలియజేసే విషయం. ఒక పోలీస్ అధికారి చిన్న అమ్మాయిని చాక్లెట్ ఇచ్చి అత్యాచారయత్నం చేయడం అన్న వార్త ఇటీవల చాలామందిని కదిలించింది. సమాజానికి ఆర్థికంగా పరిపూర్ణత చేకూర్చడానికి చాలా విషయాలు చేస్తున్నాం. కానీ సమాజం నైతిక పతనం చెందుతూ ఉంటే దానిపట్ల ఒక పాలసీ ఉండాలన్న విధానం మనకు లేకపోవడం దురదృష్టం. 

సమాజం వద్దన్నా కావాలన్నా సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారింది కాబట్టి ఎలాగూ ముందుకు పోతుంది. మరి నైతికంగా పతనం చెందితే అలాంటి సమాజం నుండి మనం ఏమి ఆశించగలుగుతాం. పూర్వం ఉన్న వ్యవస్థలు అన్నీ మంచివి కాకపోవచ్చు కానీ ప్రజల్లో మంచి చెడ్డలకు సంబంధించిన విచారణ ఉండేది. ఈరోజు మన విద్యార్థులను ధ్వంసం చేస్తున్న డ్రగ్స్ మద్యం దురలవాట్లు సోమరితనం బాధ్యతారాహిత్యం వీటి గురించి ఆలోచించకపోతే మనం కల్పించిన వసతులన్నీ ఏటిలో చింతపండు పిసకడమే.  ఒకవేళ రేవంత్ ప్రభుత్వం ఈ విషయంపై  ప్రత్యేక దృష్టి పెడితే నిజంగానే తెలంగాణ గర్వించదగ్గ నాయకుడిగా రేవంత్​ రెడ్డి మిగిలిపోతాడు.

వచ్చామా..పోయామా!

ఇటీవల ఒక జిల్లాను నడిపే విద్యాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోవడం మన విద్యా వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇలాంటి అధికారులు పై వ్యవస్థలో ఉన్నప్పుడు కిందస్థాయిలో ఉన్న వాళ్ళ పనితనం అలాగే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో నైతికత లేని ఇలాంటి వ్యక్తులు పరిపాలనాదక్షులు కాలేరు. అందువల్లనే సమయానికి వచ్చామా.. పోయామా అన్నది మెకానికల్​గా నడుస్తున్నది. కానీ, నిజంగా ఫలితాలను రాబట్టే చదువు సాధ్యపడడం లేదు. నెలకు ఒక పాఠశాలలో లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నాం. కానీ, ఆడపిల్లలు మరుగుదొడ్లకు వెళ్తే శుభ్రం చేసే వ్యక్తిని  నియమించడం  చేయడం లేదు.  ప్రభుత్వ పాఠశాలలో నెలకు పదివేల రూపాయలు ఇచ్చి ఒక తోటమాలిని, వాచ్ మెన్​ను నిర్ణయించుకోవడం సాధ్యం కావడం లేదు. దానివల్ల చాలా చోట్ల పాఠశాలల్లోకి కళాశాలల్లోకి సాయంత్రం కాగానే మద్యం బాబులు,  వ్యభిచారులు ప్రవేశిస్తున్నారు. అలాగే పాఠశాలల్లో సంస్కారం లేని ఉపాధ్యాయ సంఘాల వల్ల ఉపాధ్యాయుల మధ్య సమన్వయలేమి స్పష్టంగా కనిపిస్తోంది. 

- డా. పి. భాస్కర
యోగి,
సోషల్​ ఎనలిస్ట్​