ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫ్యాన్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు టికెట్ ఇవ్వకుండా సుధీర్ దారకు ఇవ్వడంతో ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆర్థర్ పలు మార్లు పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. కానీ పార్టీ పెద్దల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆయన పార్టీ మారారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.
గతంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఇంఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు. నందికొట్కూరు టికెట్ ఇస్తాం కానీ.. పాలన బాధ్యతలు వేరేవారికి అప్పగిస్తామని ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, ఐప్యాక్ రాయలసీమ ఇంఛార్జ్ దివాకర్‌రెడ్డి చెప్పారని ఆ వ్యాఖ్యలు విని తాను షాకయ్యానని ఆయన చెప్పారు. ఐప్యాక్ సర్వేలో తానే గెలుస్తానని వచ్చిందని కానీ పార్టీ తనకు టికెట్ కేటాయించలేదని చెప్పారాయన.