రెండు రోజులుగా సమాధిలో సాధువు

  •     విషయం తెలియడంతో బయటకు తీసుకొచ్చిన పోలీసులు

మద్దూరు, వెలుగు : నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణివెట్లకు చెందిన ఓ సాధువు రెండు రోజుల కింద సమాధిలోకి వెళ్లాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణివెట్లకు చెందిన చాకలి చిన్న హన్మంతు (హన్మంతు స్వామి) గురుభోద తీసుకొని సాధువుగా మారాడు. మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న తన చేను వద్ద మఠం కట్టుకొని పదేండ్లుగా అక్కడే ఉంటున్నాడు. 

భార్య లాలమ్మ ఆరు నెలల కింద చనిపోయింది. వీరబ్రహ్మేంద్ర స్వామిని కొలుస్తూ సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి అమావాస్య, పౌర్ణమికి ఆయన వద్దకు కర్నాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి శిష్యులు వస్తుంటారు. శుక్రవారం అమావాస్య రోజున యోగ ధ్యానంలో భాగంగా ఐదు రోజులు సమాధిలోకి వెళ్తున్నానని, ఎవరూ భగ్నం చేయొద్దని చెప్పాడు. తాను లోపలికి వెళ్లాక సమాధిని మూసి వేసి భజనలు చేయాలని శిష్యులకు సూచించాడు. 

తర్వాత అతడు సమాధిలోకి వెళ్లడంతో కొడుకు, కూతురుతో కలిసి శిష్యులు సమాధిని మూసి వేశారు. ఇది తెలిసిన భక్తులు మఠానికి క్యూ కట్టారు. విషయం పోలీసులకు తెలియడంతో డీఎస్పీ లింగయ్య, ఎస్సై రాంలాల్‌‌‌‌ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వచ్చి స్వామిని సమాధి నుంచి బయటకు తీసుకొచ్చారు. డాక్టర్లతో హెల్త్‌‌‌‌ చెకప్‌‌‌‌ చేయించారు. మఠం వద్ద రెండు రోజుల పాటు పికెటింగ్‌‌‌‌ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.