ఈ నెల 24న లగ్గం..పెండ్లికొడుకు ఆత్మహత్య

గద్వాల, వెలుగు: వారం రోజుల్లో పెండ్లి పెట్టుకోగా అంతలోనే పెండ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల రూరల్ ఎస్సై పర్వతాలు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన అంజలన్న, లక్ష్మమ్మ కొడుకు నవీన్ (24)కు, గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 24న పెండ్లి ఖాయమైంది. పెండ్లి బట్టలు తీసుకోగా, ఇతర ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నవీన్​పత్రికలు కూడా పంచాడు. బుధవారం హైదరాబాద్ కు వెళ్లి వచ్చి చిన్నాన్న ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాడు. ఎంతసేపైనా రాకపోవడంతో వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.