నాథులా పాస్ మార్గంలో ప్రమాదం..  ఏడుగురు మృతి

నాథులా పాస్ మార్గంలో ప్రమాదం..  ఏడుగురు మృతి
  • కొండ పైనుంచి వరదలా ముంచెత్తిన మంచు
  • నాథులా పాస్ మార్గంలో ప్రమాదం..  ఏడుగురు మృతి
  • మంచు కింద చిక్కుకున్న మరో 20 నుంచి 30 మంది 
  • కొనసాగుతున్న  రెస్క్యూ
  • 350 మంది టూరిస్టులను భద్రంగా తరలించిన సైన్యం

గ్యాంగ్ టక్ : వాళ్లంతా టూరిస్టులు. చైనా బార్డర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం నాథు లా పాస్ వద్ద మంచుకొండల అందాలు చూసేందుకు వెళ్తున్నారు. ఓ పర్వతం పక్క నుంచి ఇరుకైన రోడ్డు గుండా వాహనాలు ఒకదాని వెనక ఒకటి వెళ్తున్నాయి. ఇంతలో కొండపై నుంచి వాగు ద్వారా వరద నీళ్లు దూసుకొచ్చినట్లుగా.. మంచు ప్రవాహం కిందకు పోటెత్తింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంచు ప్రవహిస్తూ రావడంతో వాహనాల​తో సహా చాలా మంది లోయలో పడిపోయారు. మంచులో 
కూరుకుపోయి ఏడుగురు టూరిస్టులు మృతిచెందారు.

మృతుల్లో ఒక చిన్నారి, ఒక మహిళ కూడా ఉన్నారు. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇంకా ఇరవై నుంచి ముప్పై మంది మంచు కింద కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. గ్యాంగ్ టక్ నుంచి నాథు లా పాస్ కు వెళ్లే జవహర్ లాల్ నెహ్రూ రోడ్డులో 15వ మైలురాయి వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ అవలాంచే (మంచు విరిగిపడటం) చోటు చేసుకుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 150 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. రోడ్డు మీద నుంచి లోయలో పడిపోయిన ఆరుగురితో సహా మంచులో కూరుకుపోయిన 23 మందిని కాపాడినట్లు ఆర్మీ అధికారులు సాయంత్రం ప్రకటించారు. గాయపడిన వారిని గ్యాంగ్ టక్ లోని ఆస్పత్రికి తరలించామన్నారు.

కొండపై నుంచి పెద్ద ఎత్తున విరిగిపడిన మంచులో మరో ఐదారు వెహికల్స్ కూరుకుపోయి ఉంటాయని, ఆ వాహనాలలో 20 నుంచి 30 మంది ఉండొచ్చని తెలిపారు. మంచు వల్ల రోడ్డు బ్లాక్ అవడంతో 80 వెహికల్స్ లో వచ్చిన 350 మంది టూరిస్టులను వెనక్కి సేఫ్ గా తరలించామన్నారు. సహాయక చర్యల్లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ వో), ఆర్మీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీం, పోలీసు బృందాలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.  

పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతం..

ఇండియా, చైనా బార్డర్ లో రెండు దేశాల మధ్య మూడు చోట్ల ఓపెన్ ట్రేడింగ్ బార్డర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో గ్యాంగ్ టక్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో.. సముద్రమట్టానికి 4,310 మీటర్ల ఎత్తులో ఉన్న నాథు లా పాస్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుపొందింది. ఏటా ఈ సీజన్ లో ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తుంటారు.