హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంపై ఉమ్మడి పాలమూరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ వేసిన నారాయణ పేట జిల్లా రైతు, ఉమ్మడి పాలమూరు జిల్లా సర్పం చుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గవినోళ్ల శ్రీనివాస్ తో పాటు నారాయణపేట జిల్లా సర్పం చుల సంఘం అధ్యక్షుడు జి. సుభాష్, దౌల్తాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు కోట్ల మహిపాల్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గౌని వెంకట్రాములు , మద్దూర్ మండలం చెన్నారెడ్డిపల్లి రైతు చండేపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి తరపున సుప్రీం కోర్టు అడ్వకేట్ శ్రావణ్ కుమార్ పిటిషన్ ను ఫైల్ చేశారు.
కేంద్ర జలశక్తి శాఖ, అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు , కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరోవైపు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు వ్యతిరేకంగా చేపట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్ లను నిలిపి వేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా లోని దామరగిద్ద, గడి మున్కన్ పల్లి పంచాయతీలు, దామరగిద్ద సర్పం చుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. తీర్మానం కాపీలను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీకి పంపాయి.
