దారుణం: బతికుండగానే చంపేశారు

  • ఆసరా పింఛన్  కోసం వృద్ధుడి తిప్పలు

సంగారెడ్డి, వెలుగు: పింఛన్  కోసం పోతే.. నువ్వు చనిపోయావని.. బతికే ఉన్నానని సర్టిఫికెట్  తెమ్మంటున్నారని సంగారెడ్డి జిల్లా కోహిర్  మండలం పైడిగుమ్మల్  గ్రామానికి చెందిన ఎర్రగొల్ల తుల్జయ్య(71) వాపోతున్నాడు. ఆసరా పెన్షన్  కోసం మూడున్నరేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకుంటలేదని వాపోతున్నాడు. 2020 డిసెంబర్ లో ఆసరా పింఛన్  కోసం ఎంపీడీవోకు దరఖాస్తు చేసుకున్నాడు. 

అప్పటి నుంచి ఆఫీస్​ చుట్టూ తిరుగుతున్నా పింఛన్  మంజూరు కాలేదు. దీంతో తుల్జయ్య ఇటీవల సంగారెడ్డి కలెక్టరేట్ కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అక్కడి అధికారులు ఆధార్  కార్డుతో పింఛన్  స్టేటస్ పరిశీలించగా.. తుల్జయ్య చనిపోయినట్లు చూపించింది. దీంతో పంచాయతీ సెక్రటరీని అడగమని చెప్పి పంపించారు. కలెక్టర్  వల్లూరు క్రాంతి దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆమె సంబంధిత ఆఫీసర్లపై సీరియస్  అయ్యారు. టెక్నికల్  సమస్యతో తుల్జయ్య చనిపోయినట్లు తప్పు దొర్లిందని ఎంపీడీవో భారతి తెలిపారు. త్వరలోనే పింఛన్​ మంజూరు చేస్తామని చెప్పారు.