పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి

  • సిద్దిపేట జిల్లాలోని ఇందుప్రియాల్ ఏరియాలో ఘటన

తొగుట, దౌల్తాబాద్, వెలుగు: తల్లి పసిబిడ్డను అమ్ముతూ ఐసీడీఎస్ అధికారులకు పట్టుబడిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ఐసీడీఎస్ సూపర్ వైజర్ గిరిజ తెలిపిన వివరాలు మేరకు.. గజ్వేల్ టౌన్ లోని పల్లెపహాడ్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన పోతుల రూప తనకు రెండో కాన్పు ద్వారా పుట్టిన 20 రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టింది. గజ్వేల్ మార్కెట్ యార్డుకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ మీద ఇందుప్రియల్ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ తల్లితో  బేరం మాట్లాడుతుండగా కుదరకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. స్థానిక మేకల కాపర్లు చూసి వారి వద్దకు వెళ్లగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పరార్ అయ్యారు. వెంటనే స్థానిక అంగన్వాన్ వాడీ టీచర్ సుల్తానాకు సమాచారం అందించారు. ఆమె వెళ్లి తల్లి బిడ్డను అంగన్ వాడీ సెంటర్ కు తీసుకెళ్లారు.1098 చైల్డ్ లైన్ కు తెలపగా.. సిద్దిపేట ఐసీడీఎస్  అధికారులు వెళ్లి సఖీ సెంటర్ కు తరలించారు. తన బిడ్డను ఎందుకు అమ్ముతుందనే వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా తల్లి చెప్పడంలేదని అధికారులు తెలిపారు.