అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో తప్పిపోయిన ఎలుగుబంటి పిల్ల

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో ఎలుగుబంటి పిల్ల తల్లి నుంచి విడిపోయింది. సార్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో 50 నుంచి- 60 రోజుల వయసు ఉన్న ఎలుగుబంటి పిల్లను ఫారెస్ట్  వాచర్  గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు. సిబ్బంది ఎలుగుబంటి పిల్లను తల్లి వద్దకు చేర్చేందుకు రెండు రోజులుగా కృషి చేశారు. తల్లి ఆచూకీ లభించకపోవడం, డయేరియా లక్షణాలు కనిపించడంతో హైదారాబాద్ లోని జూకు తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, తల్లి కోసం అడవిలో గాలింపు చర్యలు చేపట్టామని డీఎఫ్ వో రోహిత్ గోపిడి తెలిపారు.