పోలీస్ స్టేషన్ ముందే దోపిడీ.. కారు అద్దాలు పగులగొట్టి చోరీ

జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పోలీస్‌‌ స్టేషన్‌‌ ముందే భారీ చోరీ జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి రూ.10 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. జోగిపేటకు చెందిన రవీందర్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఏడీగా పనిచేసి రిటైర్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ఎస్బీఐలో రూ.10 లక్షలు డ్రా చేశాడు. ఆ డబ్బును తన కారు ముందు సీటులో పెట్టి, ఇంటికి బయలుదేరాడు. మధ్యలో టౌన్‌‌ పోలీస్ స్టేషన్‌‌ వద్ద కారును ఆపి, డబ్బును అందులోనే పెట్టి రోడ్డుకు అవతలి వైపు ఉన్న స్వీట్‌‌ షాపులో స్వీట్స్‌‌ కొనేందుకు వెళ్లాడు. వచ్చే చూసేసరికి కారు ఎడమవైపు సైడ్‌‌ అద్దం పగిలి ఉంది.

అలాగే, కారులోని డబ్బు బ్యాగ్‌‌‌‌ కూడా కనిపించలేదు. వెంటనే రవీందర్‌‌‌‌‌‌‌‌ పక్కనే పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తర్వాత సీఐ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయితే, వాటిలో ఏ ఒక్కటి కూడా పని చేయడం లేదు. పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు ముందు కరెంట్ స్థంభానికి ఏర్పాటు చేసిన కెమెరా కూడా వర్కింగ్‌‌‌‌లో లేకపోవడంతో చోరీ చేసిన వారిని పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం 
గాలిస్తున్నారు.