హైదరాబాద్‎లో రూ.500 కోసం హత్య

హైదరాబాద్: అప్పు ఇచ్చిన రూ.500 అడిగినందుకు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు. ఈ విషాద ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‎లో శ్రీనివాస్ అనే డైలీ లేబర్, గుత్తేదారు సాయి మధ్య రూ.500 విషయంలో వివాదం తలెత్తింది. ఆదివారం (డిసెంబర్ 29) రాత్రి మద్యం సేవిస్తోన్న సమయంలో తనకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వాలని సాయిని అడిగాడు శ్రీనివాస్. 

మద్యం మత్తులో ఉండటంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి లోనైన సాయి పక్కనే ఉన్న డ్రైనేజ్ మూత తీసుకొని శ్రీనివాస్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్‎ను ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావమై మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.