సీఎం పీఏనని.. బోటు బాధితులకు పరిహారం ఇస్తానని మోసం

సీఎం పీఏనని.. బోటు బాధితులకు పరిహారం ఇస్తానని మోసం

విశాఖ: తూర్పు గోదావరి బోటు ప్రమాదంలో భార్యా, కూతుర్ని కోల్పోయి బాధలో ఉన్న వ్యక్తిని ఓదార్చాల్సింది పోయి.. సీఎం పీఏ అంటూ అతని దగ్గరి నుంచి డబ్బులు గుంజాడు ఓ అగంతకుడు. వివరాల ప్రకారం.. విశాఖలోని వేపగుంట ముత్యమాంబ కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు బొండా లక్ష్మి, పుష్ప బోటు ప్రమాదంలో మృతిచెందారు. మృతులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇస్తుందన్న విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి శనివారం స్థానిక జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌కు ఫోన్‌చేసి తాను అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నానని, బోటు ప్రమాద బాధితుల ఫోన్‌ నంబర్లు కావాలని కోరాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన క్రమంలో  జోనల్‌ కమిషనర్‌ ఆ వ్యక్తిని సీఎం పీఏ అని నమ్మి  బొండా లక్ష్మి భర్త శంకర్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు.

ఆ తర్వాత శంకర్‌కు 79890 97075 నంబరు నుంచి ఒక వ్యక్తి ఫోన్‌ చేసి తనను ముఖ్యమంత్రి జగన్‌ పీఏగా పరిచయం చేసుకున్నాడు. 17 లక్షలు పరిహారం వస్తుందని, అకౌంట్‌ నంబరు చెప్పాలని కోరా డు. ఆ డబ్బులు అందాలంటే తమ అకౌంట్‌లో 7, 200 వేయాలని చెప్పాడు. నిజంగా సీఎం కార్యాలయం నుంచే ఆ ఫోన్‌ వచ్చిందని భావించిన శంకర్‌.. ఖాతా వివరాలు చెప్పడమే కాకుండా వెంటనే వేపగుంట ఎస్‌బీఐలో అకౌంట్‌ నంబరు 36321029951లో నగదు డిపాజిట్‌ చేశాడు. అనంతరం తనకు కాల్‌ వచ్చిన నంబరుకు ఫోన్‌ చేయగా పనిచేయలేదు.  వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పగా.. వారు తమకు తెలియదని చెప్పడంతో మోసపోయినట్టు గుర్తించాడు. ఈ విషయం గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు శంకర్.