- కిందపడేసి కొట్టినఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఉద్యోగి
- జాబ్ తీసేసిన అధికారులు
- కేసు నమోదుచేసిన పోలీసులు
సోన్‌భద్ర(యూపీ): గ్రామంలో కరెంట్ పని చేస్తున్నడని ఓ దళితుడిపై దాడి చేశాడో వ్యక్తి.. మీద పడి కొట్టడంతో పాటు తన చెప్పులు నాకించి, గుంజీలు తీయించాడు. చెంపలపై కొడుతూ, కాళ్లతో తన్నుతూ హింసించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్ భద్ర జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నిందితుడిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న తేజ్ బలి సింగ్ పటేల్‌గా గుర్తించారు. గురువారం సాయంత్రం 21 ఏండ్ల రాజేంద్ర చమర్.. తన మామ ఇంట్లో కరెంట్ రాకపోవడంతో వెళ్లి రిపేర్ చేశాడు.
ఇది చూసి చుట్టుపక్కల వాళ్లు కూడా తమ ఇంట్లో ఉన్న కరెంట్ రిపేర్ పనులు రాజేంద్రతో చేయించుకోవడం మొదలు పెట్టారు. ఇదంతా తేజ్ బలి సింగ్ పటేల్ కు కంటగింపుగా మారింది. ఆ రిపేర్ పనుల కోసం వాళ్లంతా గతంలో తన దగ్గరికే వచ్చే వారని, రాజేంద్ర వల్ల తనకు ఆదాయం రాకుండా పోతోందని కోపం పెంచుకున్నాడు. ఈ విషయంపై రాజేంద్రతో గొడవ పడ్డాడు. గురువారం సాయంత్రం వెతుక్కుంటూ వెళ్లి రాజేంద్రపై దాడి చేశాడు. కర్రతో కొడుతూ.. కులం పేరుతో దూషించాడు. కింద పడేసి చితకబాదాడు. తన చెప్పులపై ఉమ్మి వేసి రాజేంద్రతో బలవంతంగా నాకించాడు. గుంజీలు తీయించి క్షమాపణ చెప్పించుకున్నాడు. ఇదంతా రికార్డు చేయించి సోషల్ మీడియా గ్రూప్‌లో షేర్ చేయాలని చెప్పాడు. శనివారం వీడియో పోస్ట్ చేయడంతో తేజ్‌బలి సింగ్‌పై షాగంజ్ పోలీస్ స్టేషన్లో రాజేంద్ర చమర్ కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు తేజ్‌బలి సింగ్‌ను ఉద్యోగం నుంచి తీసేశారు.
దొంగతనం చేశాడని బట్టలు విప్పి కొట్టిన్రు..
దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొందరు బట్టలు విప్పి దారుణం కొట్టారు. తనను విడిచిపెట్టాలని సదరు వ్యక్తి ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా ఇష్టారీతిన చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధరమ్‌కాంటా ఏరియా మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సాగర్ సిటీ పోలీసులు నిందితులపై కేసు రిజిస్టర్ చేశారు. అయితే.. బాధితుడు, నిందితులు ఎవరన్నది తెలియలేదని, వీడియో ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని సాగర్ సిటీ పోలీసులు వివరించారు. దొంగతనం చేశాడనే అనుమానంతోనే వారంతా కొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడి నుంచి ఏ పోలీస్ స్టేషన్లోనూ కేసు రిజిస్టర్ కాలేదన్నారు. ధరమ్‌కాంటా ఏరియాలోనే బాధితుడిని చితకబాదినట్లు స్పష్టమవుతున్నదని వివరించారు. వారం రోజుల నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని తెలిపారు.
