ఐకేపీ సెంటర్ లో వడ్ల లోడ్ లారీ మాయం

  • బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మిల్లుకు ధాన్యం తరలించినట్టు గుర్తించిన అధికారులు
  • నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం 
  • ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్ లో ఘటన

కందనూలు, వెలుగు : వడ్ల కొనుగోలు సెంటర్ నుంచి ధాన్యం లోడ్ తో వెళ్లిన లారీ మాయమైంది. ఆన్ లైన్ ద్వారా ఎంపిక చేసిన రైస్ మిల్లుకు కాకుండా బ్లాక్ లిస్టులో పెట్టిన రైస్ మిల్లుకు తరలించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్ కు స్థానిక రైతులు ధాన్యం తీసుకొచ్చారు. ఐకేపీ ఉద్యోగులు 5 మందికి చెందిన 800 బస్తాల 320 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆన్ లైన్ లో గుడిపల్లిలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును ఎంపిక చేసి ట్రక్ షీట్(ఏపీ04 టీవీ 0985)ను లారీ డ్రైవర్ రాజుకు అప్పగించారు. 

అక్కడి నుంచి వెళ్లిన డ్రైవర్, లారీ ఓనర్ తో  కుమ్మక్కై రాత్రికి రాత్రే వట్టెం ఏరియాలోని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఓ రైస్ మిల్లుకు అక్రమంగా ధాన్యం తరలించినట్లు తెలిసింది. వడ్ల లారీ ఎంతకూ చేరకపోడంతో అధికారులు అనుమానంతో విచారించారు. లారీ ఓనర్స్, స్థానిక అధికారులు కుమ్మక్కై వడ్ల లారీని అదే గ్రామానికి చెందిన తుల్జా భవాని మిల్లుకు మళ్లించారు. ఇది కాస్త బయటికి పొక్కడంతో ఉన్నతాధికారులు వార్నింగ్ ఇవ్వడంతో మిల్లు నుంచి లారీల్లో లోడ్ చేసుకుని గుడిపల్లి రైస్ మిల్ కు తరలించారు. 

మండల అధికారిని వివరణ కోరగా చెప్పడానికి నిరాకరించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే కిందిస్థాయిలో లారీ ఓనర్స్, డ్రైవర్స్ తో అధికారులు కుమ్మక్కై వడ్ల లారీని పెండింగ్ ఉంచి మిల్లులకు తరలించి ఇటు ప్రభుత్వాన్ని, అటు రైతులను బురిడీ కొట్టిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.