ఇంటిముందుకొచ్చిన భారీ మొసలి

  •      నాలుగు గంటలు శ్రమించి బంధించిన అధికారులు
  •     వనపర్తి జిల్లా జానంపేట గ్రామంలో ఘటన

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో మొసలి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున కుక్కలు మొరగడంతో నాగన్న అనే వ్యక్తి తన ఇంటి తలుపులు తెరిచి బయటకు వచ్చాడు. వాకిట్లో భారీ సైజులో ఉన్న మొసలి కనిపించడంతో షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

దాదాపు 4 గంటలు శ్రమించి 10 అడుగుల పొడవు, 180 కిలోల బరువున్న భారీ మొసలిని బంధించారు.  అనంతరం ట్రాక్టర్ సాయంతో రంగాపురం వద్ద కృష్ణా నదిలో వదిలేశారు. సమీపంలోని చెరువు నుంచి పొలాల ద్వారా మొసలి దారి తప్పి గ్రామంలోకి వచ్చినట్లు స్థానికులు  చెప్పారు. - వనపర్తి, వెలుగు