రాంగ్​రూట్‌లో వచ్చిన గుర్రం తప్పించబోయి ఢీకొన్న మూడు కార్లు

  •     9 మందికి తీవ్ర గాయాలు
  •     విరిగిన గుర్రం కాళ్లు..తలకు గాయం 
  •     మెదక్ ​జిల్లా కౌడిపల్లి సమీపంలో ఘటన

కౌడిపల్లి, వెలుగు : గుర్రం రాంగ్ రూట్లో అడ్డు రావడంతో తప్పించబోయిన ఓ కారు ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొనడంతో మూడు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురి కాళ్లు విరగ్గా, మరో నలుగురు  తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెదక్​-–హైదరాబాద్​ నేషనల్ ​హైవే పై కౌడిపల్లి సమీపంలోని పెద్ద కానాల(కల్వర్టు) వద్ద ఆదివారం జరిగింది. హైదరాబాద్​లోని చార్మినార్​కు చెందిన కొంతమంది వ్యక్తులు కారులో కుటుంబసభ్యులతో కలిసి మెదక్​లో  విందుకు వెళ్లి వస్తున్నారు. అలాగే, సంగారెడ్డి జిల్లా మల్లేపల్లికి చెందిన మరో కుటుంబం కారులో ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తోంది.

ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూర్​కు చెందిన గొర్రెల కాపరి మల్లేశం మెదక్ నుంచి నర్సాపూర్ వైపు తన గుర్రాన్ని రాంగ్ రూట్​లో ముందు వదిలేసి వెనకాల బైక్ పై వస్తున్నాడు. కౌడిపల్లి కల్వర్టు వద్దకు రాగానే నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ సడన్​గా ఎదురుగా వచ్చిన గుర్రాన్ని తప్పించబోయి గుర్రంతో పాటు వెనకాల ఉన్న బైకును, రెండు కార్లను ఢీ కొట్టాడు.

ఈ ప్రమాదంలో గుర్రం రెండు కాళ్లు విరిగి తలకు తీవ్ర గాయమైంది. గొర్రెల కాపరి మల్లేశం కాలు విరిగింది. చార్మినార్​కు చెందిన హసీనా బేగం, అబ్దుల్​ఆసిఫ్, ఇర్ఫాన్​, షోయబ్​ గాయపడ్డారు. వర్షం పడుతుండడంతో సంఘటన స్థలంలో కార్ల నుంచి గాయపడిన వారిని బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది. గాయపడ్డ వారిని నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద స్థలానికి కూతవేటు దూరంలోనే  కౌడిపల్లి పీఎస్​ ఉన్నా పోలీసులు చాలాసేపటి వరకు రాలేదు. దీంతో ప్రయాణికులే గాయపడ్డవారిని కార్లలో నుంచి బయటకు తీసి ప్రైవేటు వాహనాల్లో దవాఖానలకు తరలించారు. కార్లు రోడ్డుపై ఉండడంతో ట్రాఫిక్ ​నిలిచిపోయింది. పోలీసులు జేసీబీ సాయంతో తొలగించి క్లియర్​చేశారు.