హైదరాబాద్‎లో ఈ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‎లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చంగిచర్ల రామకృష్ణ నగర్‎లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో దట్టమైన పొగతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షోరూం నుండి మంటలు ఎగిసిపడటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ఎలక్ట్రిక్ వెహికల్స్‎లోని లిథియం బ్యాటరీల వల్ల అగ్ని జ్వాలలు ఎగిసిపడటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అన్న విషయం తెలియాల్సి ఉంది.