అల్ జజీరా మహిళా జర్నలిస్ట్‌ను చంపిన ఇజ్రాయిల్ దళాలు..?
జెరూసాలెం : ఇజ్రాయిల్ దళాలు జరిపిన దాడిలో అల్ జజీరాలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా రిపోర్టర్ మృతి చెందారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు మరింత పెరిగాయి. జెనిన్ లోని ఆక్రమిత వెస్ట్ బ్యాంకు పట్టణంలో బుధవారం (ఈనెల 11న) ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో అల్ జజీరాకు చెందిన రిపోర్టర్ షిరీన్ అబు అఖ్లే చనిపోయారు. షిరీన్ ను అతి దారుణంగా హత్య చేశారంటూ అల్ జజీరా ఆరోపిస్తోంది.
పాలస్తీనాకు చెందిన 51 ఏళ్ల షిరీన్ అల్ జజీరాలో 1997 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జెనిన్ ప్రాంతంలో ఇజ్రాయిల్ దాడులను రిపోర్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నారు. ఎప్పటిలానే బుధవారం (ఈనెల 11న) విధులు నిర్వర్తిస్తుండగా అక్కడ జరిగిన కాల్పుల్లో షిరీన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారని తెలుస్తోంది. మరో పాలస్తీనా జర్నలిస్టు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు.
ఘటన జరిగిన సమయంలో షిరీన్ బుల్లెట్ జాకెట్ ధరించి ఉన్నారు. దానిపై ప్రెస్ అని కూడా రాసి ఉంది. షిరీన్ మృతిని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్ దళాలు కావాలనే షిరీన్ పై కాల్పులు జరిపాయని ఆరోపిస్తోంది. ఇజ్రాయిల్ దళాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ దారుణానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి కావాలనే జరిగిందని ఈ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని అల్ జజీరా వేడుకుంటోంది.
షిరీన్ ప్రెస్ వెస్ట్, హెల్మెట్ ధరించినా ఆమె తలపై తుపాకీతో కాల్చడంతోనే మరణించారని ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కామెంట్స్ చేశారు. ఇజ్రాయిల్ ఈ ఆరోపణలను ఖండించింది. పాలస్తీనా గన్ మెనే షిరీన్ ను కాల్చి ఉంటారని, దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ఉదయం ఆపరేషన్ చేపట్టిన సమయంలో అక్కడ పరిస్థితి అదుపు తప్పిందని ఇజ్రాయిల్ తెలిపింది. దీంతో అనుమానితులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఈ క్రమంలో జర్నలిస్ట్ షిరీన్ గాయపడ్డారని ఇజ్రాయిల్ చెబుతోంది. గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని, కానీ అప్పటికే ఆమె మృతి చెందారని వెల్లడించింది.
పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధానికి కారణం :
వెస్ట్ బ్యాంకు ప్రాంతాన్ని 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ భూభాగం కోసం పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం..
