మద్యం మత్తులో యువకుల హల్చల్.. వెహికల్తో ఢీకొట్టి ఓ ఫ్యామిలీపై దాడి

  • అడ్డుకోబోయిన పోలీసులపై తిరుగుబాటు
  • గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టు దగ్గర ఘటన

గద్వాల, వెలుగు: మద్యం మత్తులో ఐదుగురు యువకులు గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్​ సమీపంలోని సుంకులమ్మ మెట్టు దగ్గర  బుధవారం రాత్రి హల్చల్​ చేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త బస్టాండ్  నుంచి పాత బస్టాండ్ కు  భార్యాభర్తలు బైక్​పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో బైక్ తో ఢీకొట్టారు. ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించగా.. వారిపై దాడికి దిగారు. ఈ విషయాన్ని ఆ దంపతులు తన కొడుకు హర్షకు చెప్పడంతో ఆయన స్కూటీపై వచ్చి ఆ యువకులను ప్రశ్నించగా.. వారితో వాగ్వివాదం జరిగింది.

ఈ క్రమంలో ఆ యువకుడిని విపరీతంగా కొట్టడంతో పాటు పరిగెత్తించి దాడి చేశారు. విషయాన్ని పోలీసులకు చెప్పడంతో అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా..  వారిపై కూడా సదరు యువకులు తిరగబడ్డారు. ఓ పోలీస్ ఆఫీసర్ పై దాడి చేశారు. ఓ కానిస్టేబుల్ ను నెట్టేశారు. గద్వాల టౌన్  ఎస్సై అక్కడికి వచ్చి వారించే ప్రయత్నం చేస్తున్నా వినకుండా  రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ హంగామా చేశారు. దాడి చేసినట్లు అనుమానం ఉన్న ఐదుగురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితులు గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. దాడికి ప్రయత్నించిన యువకులు మాజీ కౌన్సిలర్  అనుచరులని చెబుతున్నారు.