తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!

 తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తీవ్ర విషాదం నెలకొంది.  వైకుంఠ సర్వ దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరిని ఒకరిని తమిళనాడు సేలంకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. విష్ణునివాసం వద్ద టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురం పార్క్ ప్రాంతాల్లో క్యూలైన్ల దగ్గర కూడా తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భక్తులను అదుపు చేశారు. తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తొలి మూడు రోజులు 10, 11, 12వ తేదీలకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శన టికెట్లు గురువారం (జనవరి 9) తెల్లవారుజూము 5 గంటల నుండి తిరుపతిలోని ప్రత్యేక కౌంటర్లో ఇస్తామని టీడీపీ తెలిపింది. దీంతో సర్వ దర్శన టికెట్ల కోసం భక్తులు బుధవారం (జనవరి 8) సాయంత్రం నుండే టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. భక్తులు ఒకేసారి పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. టోకెన్న జారీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతోనే తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని భక్తులు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.