మరో చిక్కుల్లో సాధ్వి అన్న‌పూర్ణ‌ : అలీఘర్ లో కేసు

మరో చిక్కుల్లో సాధ్వి అన్న‌పూర్ణ‌ : అలీఘర్ లో కేసు

అలీఘ‌ర్‌ : ఓ వ‌ర్గంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన రైట్ వింగ్ నేత‌ సాధ్వి అన్న‌పూర్ణ అలియాస్ పూజా షాకున్ పాండేపై ఉత్తరప్రదేశ్ లోని అలీఘ‌ర్‌లో కేసు నమోదైంది. రెండు వ‌ర్గాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని పెంచేలా కామెంట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌లు చేసిన సాధ్వి అన్నపూర్ణను రెండుసార్లు అలీఘ‌డ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ, ఆ రెండు కేసుల్లోనూ ప్ర‌స్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. అలీఘ‌డ్‌లోని గాంధీపార్క్ పోలీస్ స్టేష‌న్‌లో 153ఏ, 153బీ 295ఏ, 298, 505 సెక్ష‌న్ల కింద కేసు బుక్ చేసిన‌ట్లు ఎస్పీ క‌ళానిధి నైతాని తెలిపారు. 

అఖిల భారత హిందీ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షాకున్.. 2019లో గాంధీ దిష్టిబొమ్మ‌పై కాల్పులు జ‌రిపారు. గాడ్సేను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ఢిల్లీలో ఇటీవ‌ల జ‌రిగిన ధ‌ర్మ సంస‌ద్‌లోనూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ ఘ‌ట‌న‌లో ఢిల్లీ పోలీసులు సాధ్వి అన్న‌పూర్ణపై కేసు నమోదు చేశారు.