ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిశోర్‎పై కేసు నమోదు

 పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్‎పై కేసు నమోదు అయ్యింది. పీకేతో పాటు జన్ సూరాజ్ పార్టీ నాయకులు, మరికొందరు   కోచింగ్ సెంటర్ల యజమానులు, 700 మంది నిరసనకారులపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్ కిషోర్ మరికొందరు కలిసి బీపీఎస్సీ అభ్యర్థులను ప్రేరేపించి శాంతి భద్రతల సమస్య సృష్టించారని పోలీసులు ఆరోపించారు. జన్ సూరాజ్ పార్టీ నాయకులు పోలీసుల అనుమతి లేకుండా నిరసన కవాతు నిర్వహించి పాట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలో జనాన్ని పొగు చేయడంతో పరిస్థితి హింసాత్మకంగా మారిందని పేర్కొన్నారు. 

పోలీసుల లౌడ్‌స్పీకర్లను బద్దలు కొట్టి.. అభ్యర్థులను అల్లర్లకు ప్రేరేపించారని ఆరోపించారు పోలీసులు. ఈ మేరకు వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఓ పరీక్ష పత్రం లీకైందని.. ఆ ఎగ్జామ్‎ను రద్దు చేసి మళ్లీ తిరిగి పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం (డిసెంబర్ 29) పాట్నాలోని గాంధీ మైదాన్‎లో అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బీపీఎస్సీ అభ్యర్థుల నిరసనకు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు.ఈ మేరకు అభ్యర్థుల ఆందోళనలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. 

అభ్యర్థులతో కలిసి సీఎం నితీష్ కుమార్‎ను కలిసేందుకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు నిరసనకారులపై లాఠీ చార్జ్, వాటర్  కెనాన్స్ ప్రయోగించారు. పోలీసులు లాఠీ చార్జ్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిరసన వ్యక్తం చేస్తోన్న అభ్యర్థులను పశువులను బాదినట్లు బాదారని పోలీసుల తీరుపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వ్యుహాకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024, అక్టోబర్ 2న జన్ సూరజ్ పార్టీతో పీకే పాలిటిక్స్ మొదలు పెట్టారు.