అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామానికి పరుచూరి అభిజిత్(20)ను కొందరు దుండగులు హత్య చేశారు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న అభిజిత్ ను.. మార్చి 11న యూనివర్సిటీ క్యాంపస్‌లో హత్య చేసి.. మృతదేహాన్ని అడవి ప్రాంతంలో పడేశారు. స్నేహితలు ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మొబైల్ ఫోన్ సిగ్నల్ ద్వారా అభిజిత్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం అనంతరం ఇండియాకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా, మార్చి 15వ తేదీ శుక్రవారం రాత్రి అభిజిత్ భౌతికకాయం.. స్వగ్రామం బుర్రిపాలెంకు తీసుకొచ్చారు పోలీసులు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి శవమై తిరిగి వచ్చిన కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటనతో బుర్రిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గత జనవరి16న ఓ భారతీయ విద్యార్థి కూడా దారుణ హత్యకు గురయ్యాడు. భారత్ కు చెందిన వివేక్ సైనీ (25) బీటెక్ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ సంపాదించాడు. ఈక్రమంలో జార్జియాలోని ఓ స్టోర్ వద్ద దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు.
కాగా, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు భారతీయ విద్యార్థులు. ఇటీవల కాలంలో ఇండియన్ విద్యార్థుల మరణాలు ఎక్కువయ్యాయి. అందులోనూ హత్యకు గురవుతుండడంతో ఆందోళనకు గురిచేస్తోంది.