కరెంట్​ పోల్​ విరిగి పడి బాలుడు మృతి

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పడి బాలుడు చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అలంపూర్ పట్టణం సంగమేశ్వర కాలనీకి చెందిన మానస, మద్దిలేటి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వారి ఇంటి పక్కన కరెంట్​ తీగలపై చెట్టు కొమ్మలు పడుతుండడంతో విద్యుత్  శాఖ అధికారులకు కంప్లైంట్​ చేశారు. ఆదివారం సప్లై నిలిపి వేసి, చెట్టు కొట్టడంతో కొమ్మ విరిగి కరెంట్​ తీగలపై పడింది. కరెంట్​పోల్​పాతది కావడంతో అది విరిగి ఇంటి ముందు ఆడుకుంటున్న మహేశ్(4)పై పడడంతో తీవ్రగాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. విద్యుత్  శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విద్యుత్​ ఏఈ ఆఫీస్​ ముందు ఆందోళనకు దిగారు. మృతుడు తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.