దారుణం.. దొంగతనం చేసిండని కొట్టి చంపిన్రు

శివ్వంపేట, వెలుగు: దొంగతనం చేశాడన్న అనుమానంతో ఇద్దరు వ్యక్తులు ఓ బిచ్చగాడిని బైక్‌‌‌‌కు కట్టేసి ఈడ్చుకెళ్లడంతో పాటు తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు చనిపోయాడు. మెదక్‌‌‌‌ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోమారం గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవించే గుర్తు తెలియని వ్యక్తి (40) ఈ నెల 5న గ్రామ శివారులో చనిపోయి కనిపించాడు. సెక్రటరీ కృష్ణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బిచ్చగాడి మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌ చేశారు.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మణికంఠగౌడ్‌‌‌‌, తిరుపతిరెడ్డి అనే వ్యక్తులు చోరీ చేశాడన్న అనుమానంతో ఈ నెల 4న బిచ్చగాడిని తీవ్రంగా కొట్టారని, అలాగే బైక్‌‌‌‌కు కట్టేసి గ్రామ శివారులోకి ఈడ్చికెళ్లినట్టు సీసీ టీవీ పుటేజీలో గుర్తించారు. దెబ్బల వల్లే బిచ్చగాడు చనిపోయాని పోస్ట్‌‌‌‌మార్టంలో తేలడంతో మణికంఠ గౌడ్, తిరుపతి రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తూప్రాన్‌‌‌‌ సీఐ కృష్ణ, శివ్వంపేట ఎస్సై మహిపాల్‌‌‌‌రెడ్డి తెలిపారు.

===========================================================================