గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీలు దాటితే.. హిమాలయాలకు కరువు ముప్పు

గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీలు దాటితే.. హిమాలయాలకు కరువు ముప్పు

 

  •     90% ప్రాంతాలు కరువులోకి..
  •     బ్రిటన్ యూనివర్సిటీ పరిశోధకుల హెచ్చరిక  
  •     6 దేశాల్లో.. 8 అంశాలపై అధ్యయనం చేసి రిపోర్ట్

న్యూ‌‌‌‌‌‌‌‌ఢిల్లీ: భూగోళం వేడెక్కుతున్న కారణంగా ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆకస్మిక వరదలు, కరువు, భూకంపాలు, అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగితే ఇండియాలో హిమాలయ పర్వత పరిసరాల్లోని 90 శాతం ప్రాంతాలు ఏడాది పాటు తీవ్ర కరువు ఎదుర్కుంటాయని బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా(యూఈఏ) రీసెర్చర్లు హెచ్చరించారు. పారిస్ ఒప్పందం మేరకు గ్లోబల్ వార్మింగ్​ను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తేనే పరిస్థితిని 80 శాతం కంట్రోల్ చేయొచ్చని  స్పష్టం చేశారు. ఇండియా, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనాలోని వాతావరణ పరిస్థితులపై యూనివర్సిటీ రీసెర్చర్లు స్టడీ చేశారు. 

ఇప్పుడున్నది 1.5 డిగ్రీలు.. 

గ్లోబల్ వార్మింగ్ 3–4 డిగ్రీలు పెరిగితే ఇండియాలో పాలినేషన్ (పరాగ సంపర్కం) సగానికి తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. 1.5 డిగ్రీలు పెరిగితే పావు వంతు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల వద్ద ఉందని.. దీనిని ఇంతకే పరిమితం చేస్తే.. ఇండియాలోని సగం జీవ వైవిధ్యానికి మేలు జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా, గ్లోబల్ వార్మింగ్ మూడు డిగ్రీలు పెరిగితే.. 30 ఏండ్లలో ప్రతి దేశంలోని 50 శాతానికి పైగా వ్యవసాయ భూమి ఏడాది కంటే ఎక్కువ కాలం తీవ్రమైన కరువుకు గురవుతుందని యూనిర్సిటీ బృందం అంచనా వేసింది. అలాగే ఆరు దేశాలు గ్లోబల్ వార్మింగ్​ను 1.5 డిగ్రీల వద్ద పరిమితం చేస్తే 20 నుంచి 80 శాతం కరువు నివారించొచ్చని రీసెర్చర్లు వెల్లడించారు.