ముంబై: గతంలోని పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్ల ఆదరణ దొరకడంతో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో 87 ఎస్ఎంఈ (స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజస్)లు ఐపీఓల ద్వారా రూ. 1,460 కోట్లను సమీకరించాయి. అంతకు ముందు పూర్తి ఏడాదిలో 56 ఎస్ఎంఈలు ఐపీఓల ద్వారా రూ. 783 కోట్లు మాత్రమే సేకరించాయి. ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఏడాది మిగిలిన మూడు నెలల్లో మరిన్ని స్ట్రాంగ్ కంపెనీలు ఐపీఓలకు వస్తాయని అంచనా వేస్తున్నారు. టెక్ బేస్డ్ బ్రోకింగ్ ప్లేయర్లు ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ డెవలప్‌మెంట్‌కోసం మరింతగా పనిచేసే అవకాశం ఉందని ఫెడెక్స్ సెక్యూరిటీస్ డైరెక్టర్ ఉదయ్ నాయర్ చెప్పారు. ఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా ఏర్పాటయిన ప్లాట్‌ఫామ్ చిన్న కంపెనీలకు బాగా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. తమకు కావల్సిన క్యాపిటల్‌ను కంపెనీలు ఇక్కడ సేకరించగలుగుతున్నాయని అన్నారు.
ఎస్ఎంఈ సెగ్మెంట్లో బేరిష్‌నెస్ లేదు....
స్టాక్మార్కెట్లోని బేరిష్ ఎఫెక్ట్ ఎస్ఎంఈ సెగ్మెంట్లో కనబడటం లేదని, దీంతో ఇన్వెస్టర్లు కూడా చిన్న కంపెనీల ఐపీఓల కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై ఐపీఓలకు వచ్చేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు డాక్యుమెంట్లను ఫైల్ చేసుకున్నాయని హేమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడించారు. ఇండస్ట్రీ డేటా ప్రకారం 2022లో ఇప్పటిదాకా మొత్తం 87 చిన్న కంపెనీలు ఐపీఓలు చేసి, రూ. 1,460 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. ఐటీ, ఆటోమోటివ్ కాంపోనెంట్స్, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, జ్యుయెలరీ రంగాలలోని కంపెనీలు ఈ ఐపీఓలు చేపట్టాయి. ఒక్క సెప్టెంబర్ 2022 నెలలోనే ఏకంగా 29 చిన్న కంపెనీలు మార్కెట్ తలుపుతట్టాయి. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్‌లో ఎస్ఎంఈ ఐపీఓల సంఖ్య కేవలం తొమ్మిదే. సెప్టెంబర్‌లో వచ్చిన 29 ఐపీఓలలో 25 ఇప్పటికే ముగియగా, మరో 4 ఇంకా నడుస్తున్నాయి. ఈ ఎస్ఎంఈ ఐపీఓలకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, రిటెయిల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ దొరుకుతోంది. ఇన్సొలేషన్ ఎనర్జీ ఐపీఓ ఈ కోవకే చెందుతుంది. ఈ ఐపీఓ కిందటి వారమే ముగిసింది. ఇన్సొలేషన్ ఎనర్జీ ఐపీఓ ఏకంగా 183 రెట్లు ఎక్కువగా సబ్స్క్రిప్షన్ సాధించింది. బీఎస్ఈ ఎస్ఎంఈ ఐపీఓ ప్లాట్‌ఫామ్‌పై ఏదైనా ఒక ఎస్ఎంఈ ఐపీఓకి ఇంత ఆదరణ రావడం ఇదే మొదటిసారి. ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై చిన్న కంపెనీల ఐపీఓలకు దొరుకుతున్న ఆదరణే మరిన్ని చిన్న కంపెనీలకు ప్రేరణగా నిలుస్తోందని హేమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ పేర్కొన్నారు. ఈ ఐపీఓలు సైజులో చిన్నవైనా ఇన్వెస్టర్లకు ఇష్టంగా మారాయని అన్నారు. సెకండరీ మార్కెట్లో బేరిష్నెస్తో మెయిన్ మార్కెట్లలో కొంత స్థబ్దత నెలకొన్నప్పటికీ, ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్స్ దూసుకెళ్లడం విశేషమని చెప్పారు. ఇటీవలి నెలల్లో మెయిన్ప్లాట్ఫామ్స్పై ఐపీఓలు గణనీయంగా తగ్గాయి. చిన్న కంపెనీలకు నిధుల సేకరణ ఈజీ చేయాలనే లక్ష్యంతో 2012లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు రెండూ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్స్‌ను లాంఛ్ చేశాయి. ఎస్ఎంఈ సెక్టార్లోని కంపెనీలకు దీంతో నిధుల సేకరణ ఈజీ అయింది.
