86 శాతం అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు

  • మొత్తం 8,360 మంది పోటీ 
  • 2024 లోక్​సభ ఎన్నికల డేటా విడుదల చేసిన ఈసీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగిన లోక్​సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 86 శాతం మంది డిపాజిట్లు కోల్పోయారని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. మొత్తం 8,360 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారని వెల్లడించింది. 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన డేటాను ఈసీ విడుదల చేసింది.

 దీని ప్రకారం.. మొత్తం 12,459 మంది నామినేషన్  వేయగా తిరస్కరణ, ఉపసంహరణ తర్వాత 8,360 మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించారు. వారిలో 7,190 మందికి (86 శాతం) డిపాజిట్లు కూడా రాలేదు. 

వీరిలో 584 మంది ఆరు గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు. 68 మంది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు చెందినవారు. 2,633 మంది గుర్తింపు పొందిన, గుర్తింపు పొందని పార్టీలకు చెందినవారు. 3,095 మంది ఇండిపెండెంట్  అభ్యర్థులు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్లలో ఏడుగురే ఎన్నికయ్యారు. కాగా. 2019 లోక్ సభ ఎన్నికల్లో 8,054 మంది అభ్యర్థులు పోటీచేయగా.. 6,923 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 

10.58 లక్షల ఓట్లు రిజెక్ట్

2024 ఎన్నికల్లో 10.58 లక్షల ఓట్లు రిజెక్ట్  అయ్యాయని ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల నివేదిక తెలిపింది. రిజెక్ట్  అయిన ఓట్లలో 5,35,825 ఓట్లు పోస్టల్  ఓట్లు కాగా.. 5,22,513 ఓట్లు ఈవీఎం ద్వారా వేసినవి. ఆ ఎన్నికల్లో 97.97 కోట్ల మంది పౌరులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 

2019 ఎన్నికలతో పోలిస్తే (91.19 కోట్లు) ఇది 7.43 శాతం ఎక్కువ. రిజిస్టర్  చేసుకున్న ఓటర్లలో 64.64 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓట్లలో 63.89 కోట్ల ఓట్లు చెల్లుబాటయ్యాయి. 

కాగా.. 9,634 ఓట్లు టెండర్  ఓట్లు. అంటే వేరే వ్యక్తులు అసలు ఓటర్లు పేరిట దొంగ ఓటు వేశారు. ఆ ఎన్నికల్లో 10,51,016 పోలింగ్  స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్  స్టేషన్ కు సగటున 930 మంది ఓటర్లు ఉన్నారు. 40 పోలింగ్  కేంద్రాల్లో రీపోలింగ్  జరిగింది. గుజరాత్ లోని సూరత్  నియోజకవర్గం ఏకగ్రీవమైన ఒకేఒక్క నియోజకవర్గంగా నిలిచింది.

మహిళా అభ్యర్థులు పెరిగారు

2024 లోక్ సభ ఎన్నికల్లో 800 మంది మహిళా అభ్యర్థులు పోటీచేశారు. 2019 ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య 726. అలాగే, మహిళా ఓటర్ల సంఖ్య 2019లో 43.85 కోట్లు ఉండగా.. 2024లో 47.63కు పెరిగింది. ఓటువేసిన మహిళల శాతం 2019లో 65.55 శాతం నుంచి 65.78 శాతానికి పెరిగింది. జాతీయ పార్టీల విషయానికి వస్తే.. ఆరు జాతీయ పార్టీలు 63 శాతానికి పైగా ఓట్లు సాధించాయి. వాటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, ఆప్, ఎన్పీపీ ఉన్నాయి.