హైదరాబాద్ లో జనవరి 3 నుంచి నుమాయిష్

 

  • సీఎం చేతుల మీదుగా ప్రారంభం
  • న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో భారీ ఎల్ఈడీ స్క్రీన్​ల ఏర్పాటు
  • నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ప్రభాశంకర్ వెల్లడి 

బషీర్ బాగ్,- వెలుగు:  హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వచ్చే నెల 3వ తేదీ నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) 84వ ప్రదర్శన ప్రారంభం కానుంది. జనవరి 1వ తేదీనే ఎగ్జిబిషన్ ప్రారంభం కావాల్సి ఉండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం, సంతాప దినాల కారణంగా 3వ తేదీకి వాయిదా వేసినట్టు ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ వెల్లడించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సొసైటీ ఉపాధ్యక్షుడు కె. నిరంజన్, కార్యదర్శులు బి.సురేందర్ రెడ్డి, మోహన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నుమాయిష్–2025ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 

ఈ సారి నుమాయిష్ లో 2 వేల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మినీ ట్రైన్ తో పాటు డబుల్ డెక్కర్ బస్సు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుందన్నారు. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గోల్డెన్ జూబ్లీ బ్లాక్ ఎదురుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సందర్శకులు తమ జన్మదిన, వివాహ వార్షికోత్సవాలతో పాటు ఇతర శుభకార్యాలకు సంబంధించిన చిత్రాలను ఇక్కడ ప్రదర్శించేలా అవకాశం కల్పిస్తామన్నారు. యశోదా హాస్పిటల్ సహకారంతో 24 గంటల పాటు నుమాయిష్​లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. గతేడాది నుమాయిష్  ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.66 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సందర్శకుల భద్రత కోసం పోలీసులతో పాటు వాలంటీర్లు, వాచ్ అండ్ వార్డు కార్యకర్తలు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను, వందకుపైగా సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామన్నారు. 

పెరిగిన ఎంట్రీ ఫీజు.. 

నుమాయిష్ ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు, వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని ప్రభాశంకర్ తెలిపారు. ప్రవేశ రుసుమును రూ.40- నుంచి రూ.50-కి పెంచామన్నారు. మినీ ట్రైన్ టికెట్ ను రూ.30,- డబుల్ డెక్కర్ బస్సు టికెట్ రూ.40-గా నిర్ణయించినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్స్ కోసం వీల్ చైర్లను సమకూర్చుతున్నామని, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించి వీల్ చైర్లను   పొందవచ్చని సూచించారు.