పదేళ్ల తర్వాత చిగురించిన పేదల సొంతింటి ఆశలు..ఇందిరమ్మ ఇళ్ల కోసం 8.44 లక్షల ‌‌మంది అప్లై

  • అర్హులు 5 లక్షల మంది ఉండొచ్చని అంచనా 
  • మొదటి విడతలో 45 వేల మందికి లబ్ధి
  • బీఆర్ఎస్ ‌‌సర్కార్ హయాంలో నిర్మాణ దశలోనే నిలిచిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
  • ఇందిరమ్మ ఇళ్లతోపాటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌‌పంపిణీకి ఆఫీసర్ల కసరత్తు

కరీంనగర్, వెలుగు : తమ సొంతింటి కల నెరవేరుతుందనే ఆశలు పేదల్లో మళ్లీ చిగురించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి గతంలో అమలైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పున: ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత సర్కార్ కట్టిస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాకపోవడంతో నిరాశలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రకటన ఊరటనిస్తోంది.

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ స్కీమ్ ను త్వరిగతిన అమలు చేసేందుకు ఇప్పటికే ఆదేశించారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8.44 లక్షల అప్లికేషన్లు..

ఈ ఏడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కు గ్యాస్ సిలిండర్ తోపాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అప్లికేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8,44,521 లక్షల అప్లికేషన్లు అందాయి. వీటిలో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 3,48,811 అప్లికేషన్లు రాగా, జగిత్యాల జిల్లాలో 2,00,108, పెద్దపల్లి జిల్లాలో 1,85,404, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,10,198 అప్లికేషన్లు వచ్చాయి.

మొత్తం అప్లికేషన్లలో సుమారు 5 లక్షల వరకు అర్హత కలిగినవారు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అర్హులు ఎందరు, అనర్హులు ఎవరనే విషయాన్ని గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీలు తేల్చనున్నాయి. అలాగే మొదటి విడతలో దరఖాస్తుదారులకు సొంత ప్లాట్ ఉందా? రేషన్ కార్డు ఉందా ? ప్రస్తుతం ఉంటున్న ఇల్లు సొంతమా.. అద్దె ఇల్లా అనే విషయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. 

ఉమ్మడి జిల్లాకు 45 వేల ఇందిరమ్మ ఇళ్లు.. 

నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు 45,500 వేల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తద్వారా ఉమ్మడి జిల్లాలో ఎంపికయ్యే లబ్ధిదారులు రూ.2,270 కోట్ల మేర లబ్ధిపొందనున్నారు. సొంత ఇంటి స్థలం కలిగిన అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వనున్నారు. వీరిలో  దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ముందుగా ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులపై దృష్టి.. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అసంపూర్తి నిర్మాణాలతో పంపిణీకి నోచుకోలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25,549 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ.. 14,861 ఇళ్ల పనులను మాత్రమే ప్రారంభించింది. కొన్ని చోట్ల లాటరీ ద్వారా లబ్ధిదారులను గుర్తించినా ఇళ్ల నిర్మాణమే చేపట్టలేదు. హుజురాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నప్పటికీ కరెంట్, ఇతర సౌకర్యాల కల్పన జరగలేదు.

ఇలాంటి పెండింగ్ పనులు పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూనే సొంత స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్ ఇళ్లు మంజూరు చేసే అవకాశముంది.  

ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు

         కరీంనగర్ :                               3,48,811, 
        జగిత్యాల:                                  2,00,108
        పెద్దపల్లి:                                   1,85,404
        రాజన్న సిరిసిల్ల :                     1,10,198 

                 మొత్తం :                           8,44,521