ఓల్డ్ సిటీ స్క్వేర్ యార్డ్​కు రూ.81 వేల నష్టపరిహారం

  • 1,100 ఆస్తులు గుర్తించాం: హైదరాబాద్ కలెక్టర్​ అనుదీప్
  • 800 ఆస్తులకునోటిఫికేషన్ ఇచ్చాం 
  • 65 వేల స్క్వేర్ యార్డ్స్ సేకరిస్తమని వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కింద స్క్వేర్ యార్డ్ కు రూ. 81 వేలు చెల్లించనున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రయణ గుట్ట వరకు మొత్తం 11 వందల ఆస్తులు ప్రభావితం అవుతున్నట్లు గుర్తించగా, అందులో 800 ఆస్తులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. సమ్మతి తెలిపిన యజమానులకు పది రోజుల్లో పరిహారం చెల్లిస్తామన్నారు. మెట్రో కోసం 7.5 కి.మీ దూరంలో 11 వందల ఆస్తులకు సంబంధించి 65 వేల స్క్వేర్ యార్డ్స్ భూమిని సేకరించనున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నరు.

ఇప్పటికే కన్సంట్ కోసం 50 ఆస్తులు

ఓల్డ్ సిటీ మెట్రో భూ సేకరణకు సంబంధించి ఇది వరకు జనరల్ అవార్డు ద్వారా స్క్వేర్ యార్డ్ కు రూ.63 వేలు నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఆస్తులు కోల్పోతున్నవారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కన్సంట్ అవార్డు కింద స్క్వేర్ యార్డ్ కు రూ.81 వేలు ఇవ్వడానికి నిర్ణయించారు. ఇప్పటికే 50 ఆస్తులు కన్సంట్ కోసం వచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే, వివాదాలు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులకు జనరల్ అవార్డు కింద స్క్వేర్ యార్డ్ కు రూ. 63 వేలే చెల్లించనున్నట్లు చెబుతున్నారు. ఆ నష్టపరిహారం ఎవరికి చెందాలో కోర్టే నిర్ణయింస్తుందంటున్నారు. వివాదాలు, కోర్టు కేసుల ప్రాపర్టీకి చెందిన ఇరు పార్టీలు ఒక ఒప్పందంతో వస్తే.. వారికి స్క్వేర్ యార్డ్ కు 81 వేలు చెల్లిస్తామని తెలిపారు.

వేగంగా మెట్రో విస్తరణ: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ఓల్డ్ సిటీ మెట్రోకు రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులు వేగవంతంగా చేపట్టాలని సీఎం రే వంత్ రెడ్డి ధృడ నిశ్చయంతో ఉన్నారని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్(హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. భూసేకరణ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది రాపిడో సర్వీసులు కోటి మంది మెట్రో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన సందర్భంగా బేగంపేటలోని మారిగోల్డ్ హోటల్ లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్వీఎస్​రెడ్డి మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించడానికి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్, రాపిడో మధ్య  భాగస్వామ్యం హైదరాబాద్‌‌‌‌లో అర్బన్ మొబిలిటీ ఇంకా మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్‌‌‌‌ సీఓఓ మురళీ వరదరాజన్, రాపిడో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పవన్ దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.