విజయవాడ: ఏపీలోకి అక్రమంగా మద్యం తరలించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు చిన్న చిన్న సెక్షన్లతో సరిపెట్టిన పోలీసులు.. ఇక నుండి ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. తెలంగాణ నుండి ఏపీకి అక్రమంగా భారీగా తరలివస్తున్న మద్యానికి బ్రేక్ వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మద్యం ఒక్కటే కాదు.. ఏపీ నుండి ఇతర రాష్ట్రాలకు ఇసుక ను అక్రమంగా ఎగుమతి చేసినా.. ఇదే శిక్షలు పడేలా చేస్తామంటున్నారు కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ వకూల్ జిందాల్. సోమవారం జగ్గయ్యపేట వద్ద తెలంగాణ నుండి ఏపీకి అక్రమంగా మద్యం తీసుకు వస్తున్న 10 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 1026 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి 8 ఏళ్ల జైలు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
మరోవైపు దక్షిణ తెలంగాణ సరిహద్దులోని అలంపూర్ నుండి కర్నూలులోకి వచ్చి పడుతున్న అక్రమ మద్యాన్ని నిలువరించేందుకు అక్కడి పోలీసులు కూడా నానా తంటాలుపడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా… ఎంత మందిని పట్టుకుంటున్నా.. ఇంకా అక్రమ మద్యం భారీగా వచ్చిపడుతోందే తప్ప ఆగడం లేదు.. సోమవారం తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా కర్నూలు జిల్లాలోకి తీసుకు వచ్చిన 899 మద్యం బాటిళ్లను కర్నూలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 26 మందిపై కఠినమైన లాక్ డౌన్ నిబంధనల మేరకు ఐపీసీ 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కడప నగరంలోని వై జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో తెలంగాణ నుండి కడపకు ఓ కారులో తీసుకుని వస్తున్న 55 మద్యం ఫుల్ బాటిళ్లు.. 329 క్వార్టర్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి కారు వదిలిపెట్టిన నిందితుడు పాత నేరస్తుడు వినయ్ కుమార్ రెడ్డిగా గుర్తించారు కడప పోలీసులు.


