జైపూర్: రాజస్థాన్లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది గాయపడ్డారు. కెమికల్తో వెళుతున్న ట్రక్, పెట్రోల్ బంక్ సమీపంలో ఎల్పీజీ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. నేషనల్ హైవే కావడంతో ఇతర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ఫైరింజన్లు, అంబులెన్స్ లు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. పెట్రోల్ బంక్ సమీపంలో దాదాపు 20 వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. ఈ వాహనాలన్నీ మంటల్లో చిక్కుకున్నాయి. దాదాపు 20 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. క్షతగాత్రులను సమీపంలోని జైపూర్ సవాయి మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.