11 రోజుల్లో 8 ఎన్​కౌంటర్లు .. పంజాబ్​లో గ్యాంగ్​స్టర్లే టార్గెట్​గా పోలీసుల వేట

11 రోజుల్లో 8 ఎన్​కౌంటర్లు .. పంజాబ్​లో గ్యాంగ్​స్టర్లే టార్గెట్​గా పోలీసుల వేట

చండీగడ్: గ్యాంగ్​స్టర్లపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మోగా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు గ్యాంగ్​స్టర్​లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వాళ్లంతా లక్కీ పాటియాల్ గ్యాంగ్​కు చెందినవాళ్లుగా గుర్తించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం రాత్రి మోగా జిల్లాలో బారికేడ్లు ఏర్పాటు చేసి వెహికల్స్ చెక్ చేస్తున్నది. అదే టైమ్​లో అక్కడికి బైక్​పై వచ్చిన ముగ్గురు గ్యాంగ్​స్టర్లు.. పోలీసులను చూసి బైక్ టర్న్ చేసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు.

దీంతో వారిని పోలీసులు వెంబడించగా.. బైక్ వదిలేసి పొలాల్లోకి పారిపోయారు. పోలీసులపై గ్యాంగ్​స్టర్లు కాల్పులు ప్రారంభించడంతో.. వాళ్లు ఎదురు కాల్పులు జరిపారు. తర్వాత ముగ్గురు గ్యాంగ్​స్టర్లు లొంగిపోయినట్లు పోలీసులు వివరించారు. పారిపోయేందుకు ప్రయత్నింస్తుండగా.. ఓ గ్యాంగ్​స్టర్​కు గాయాలయ్యాయని తెలిపారు. కాల్పుల కారణంగా ఎవరూ గాయపడలేదని వివరించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పంజాబ్ వ్యాప్తంగా 11 రోజుల్లో 8 ఎన్​కౌంటర్లు జరిగాయి. శనివారం మోహలీ, పటియాలాలో రెండు ఎన్​కౌంటర్లు జరగ్గా.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి.